తిరుపతి ఎన్నికలో ఓటింగ్ శాతం తగ్గడం ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు నిదర్శనం: చంద్రబాబు

02-05-2021 Sun 21:30
  • తిరుపతిలో వైసీపీ విజయం
  • ట్విట్టర్ లో స్పందించిన చంద్రబాబు
  • టీడీపీ శ్రేణులు పోరాడాయని కితాబు
  • మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానంటూ వ్యాఖ్యలు
  • నైతిక విజయం తమదేనని వెల్లడి
Chandrababu responds on Tirupati lok sabha by polls result

తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీ ఓటమిపై చంద్రబాబు స్పందించారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో వైసీపీ నేతల అధికార దుర్వినియోగానికి, అక్రమాలకు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడిన టీడీపీ శ్రేణులకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. వైసీపీ అక్రమాలపై ఎదురొడ్డి పోరాడిన టీడీపీ కార్యకర్తలను, నాయకులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు తెలిపారు. పోరాటమే మన ఊపిరి అని పేర్కొన్నారు. తిరుపతి ఎన్నికలో ఓటింగ్ శాతం తగ్గడం వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు అద్దం పడుతోందని వెల్లడించారు.

అరాచకాలు, అక్రమాలతో ప్రజాస్వామ్యాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తున్న వైసీపీ చర్యలకు వ్యతిరేకంగా పోరాడిన టీడీపీ కార్యకర్తల తెగువ స్ఫూర్తిదాయకం అని అభివర్ణించారు. అప్రజాస్వామిక, అనైతిక కార్యకలాపాలతో ఐదు లక్షలకు పైగా మెజారిటీ వస్తుందని అహంభావంతో వ్యవహరించిన వైసీపీ శ్రేణులకు ఓటుతో బుద్ధి చెప్పిన తిరుపతి లోక్ సభ ఓటర్లకు అభినందనలు అంటూ వ్యాఖ్యానించారు. తిరుపతిలో ఫలితం ఏదైనా నైతిక విజయం టీడీపీదే అని స్పష్టం చేశారు.