కెప్టెన్ మారినా అదే ఫలితం... సన్ రైజర్స్ కు మరో ఓటమి

02-05-2021 Sun 19:34
  • వరుస పరాజయాల బాటలో సన్ రైజర్స్
  • డేవిడ్ వార్నర్ స్థానంలో విలియమ్సన్ కు కెప్టెన్సీ
  • రాజస్థాన్ చేతిలో పరాజయం
  • 55 పరుగుల తేడాతో ఓడిన హైదరాబాద్
Sunrisers lost another match despite captaincy change

వరుస పరాజయాల బాటలో పయనిస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ తలరాత మారుతుందేమోనని కెప్టెన్ ను మార్చినా ప్రయోజనం దక్కలేదు. డేవిడ్ వార్నర్ ను తప్పించి కేన్ విలియమ్సన్ ను కెప్టెన్ ను చేసినా సన్ రైజర్స్ తలరాత మారలేదు. ఇవాళ రాజస్థాన్ రాయల్స్ తో ఢిల్లీలో జరిగిన మ్యాచ్ లోనూ సన్ రైజర్స్ దారుణంగా ఓడిపోయింది. అన్ని రంగాల్లో రాణించిన రాజస్థాన్ 55 పరుగుల తేడాతో నెగ్గింది.

రాజస్థాన్ విసిరిన 221 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 165 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్లు మనీశ్ పాండే 31, జానీ బెయిర్ స్టో 30 పరుగులు చేశారు. కెప్టెన్ విలియమ్సన్ 20 పరుగులు నమోదు చేశాడు. రాజస్థాన్ బౌలర్లలో ముస్తాఫిజూర్ రెహ్మాన్ 3, క్రిస్ మోరిస్ 3 వికెట్లు తీశారు.

అంతకుముందు, జోస్ బట్లర్ (124) సెంచరీ సాయంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 220 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఈ మ్యాచ్ తో కలిపి టోర్నీలో ఇప్పటివరకు 7 మ్యాచ్ లు ఆడిన సన్ రైజర్స్ ఒక్క మ్యాచ్ లో గెలిచి ఆరింట ఓడింది.

ఇక, నేడు జరిగే రెండో మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నిలుస్తోంది.