Andhra Pradesh: గల్లా జయదేవ్ కు ఏపీ సర్కారు షాక్... 'అమరరాజా'కు కరెంట్ కట్ చేయడంతో నిలిచిన ఉత్పత్తి!

  • గల్లా జయదేవ్ కుటుంబీకుల అధీనంలో ఉన్న అమరరాజా
  • పర్యావరణ అనుమతులు పాటించడం లేదన్న పీసీబీ
  • తక్షణం ఉత్పత్తి నిలిపివేయాలని ఆదేశాలు
Shock to Amararaja amid PCB Gives Closure Notice

గల్లా జయదేవ్ కుటుంబ యాజమాన్యంలో ఉన్న అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్ కు విద్యుత్ సరఫరాను ఏపీ ఎస్పీడీసీఎల్ నిలిపివేసింది. ఇదే సమయంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (పీసీబీ) సంస్థను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో నిన్నటి నుంచి సంస్థలో ఉత్పత్తి నిలిచిపోగా, తాము చట్టపరంగా ముందుకు వెళతామని సంస్థ యాజమాన్యం ప్రకటించింది. పీసీబీ నుంచి ఎలక్ట్రిసిటీ బోర్డుకు అందిన ఆదేశాల మేరకే కరెంట్ సరఫరాను అధికారులు కట్ చేసినట్టు తెలుస్తోంది.

కాగా, అమరరాజాలో ప్రత్యక్షంగా 50 వేల మంది, పరోక్షంగా మరో 50 వేల మంది వరకూ ఉపాధి పొందుతున్నారు. సంస్థకు క్లోజర్ నోటీసును జారీ చేయడంతో వారందరిలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అమరరాజా సంస్థ చిత్తూరు జిల్లా కరకంబాడి, నూనెగుండ్లపల్లి ప్రాంతాల్లోని సంస్థ యూనిట్లు పర్యావరణ అనుమతులను ఉల్లంఘిస్తున్నాయని, ఆపరేషన్ నిర్వహణ సమ్మతి షరతులను పాటించడం లేదని ఆరోపిస్తూ, కంపెనీని మూసి వేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. సంస్థ కార్యకలాపాలతో ఆ ప్రాంతంలోని గాలిలో మట్టి, సీసమ్ (లెడ్) పరిణామాలు పెరిగిపోయాయని తమ స్టడీలో వెల్లడైందని, ఉద్యోగుల రక్త నమూనాలను పరిశీలించగా, వారి శరీరంలోనూ సీసం పెరిగిందని అధికారులు వెల్లడించారు.

ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని, పరిస్థితి అలాగే కొనసాగితే, వారందరి శరీర అవయవాలు తీవ్రంగా దెబ్బతింటాయని, పర్యావరణ కాలుష్య కారణంగా ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతుందని, అందుకే ఈ ఆదేశాలు ఇస్తున్నామని ఉన్నతాధికారులు వెల్లడించారు. తమ ఆదేశాలు అందిన తరువాత సంస్థలో కార్యకలాపాలు నిర్వహిస్తే, నీటి కాలుష్య నియంత్రణా మండలి చట్టంలోని సెక్షన్ 41తో పాటు వాయు కాలుష్య నియంత్రణ చట్టంలోని సెక్షన్ 37 (1) ప్రకారం 18 నెలల నుంచి ఆరేళ్ల వరకూ జైలు శిక్షతో పాటు భారీగా జరిమానా విధించాల్సి వస్తుందని హెచ్చరించారు.

కాగా, ఈ నోటీసులపై అమరరాజా యాజమాన్యం స్పందించింది. తాము 35 సంవత్సరాలుగా సంస్థను విజయవంతంగా నడిపిస్తూ, పర్యావరణానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొంది. పలు దేశాలకు రక్షణ, వైద్య, టెలికం విభాగాలకు సంబంధించిన ఉత్పత్తులను అందిస్తున్నామని, ఈ నోటీసులపై తాము చట్టపరంగా ముందుకు వెళతామని పేర్కొంది.

More Telugu News