భారత్‌లో ఉండి వస్తే ఐదేళ్ల జైలు శిక్ష.. తమ పౌరులపై ఆస్ట్రేలియా కఠిన ఆంక్షలు

01-05-2021 Sat 08:35
  • దేశ చరిత్రలోనే తొలిసారి కఠిన ఆంక్షలు
  • భారత్‌లో 9 వేల మంది ఆస్ట్రేలియన్లు
  • వారిలో 600 మందికి కరోనా సోకే ప్రమాదం
  • ఐపీఎల్‌లో ఆడుతున్న ఆసీస్ క్రికెటర్లకు మినహాయింపు!
Australians to face jail or heavy fine if they go home from India

భారతదేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ చరిత్రలోనే తొలిసారి కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. భారత్ నుంచి స్వదేశానికి వచ్చే తమ పౌరులపై తాత్కాలిక నిషేధం విధించింది. భారత్‌లో 14 రోజులపాటు ఉన్న తమ దేశ పౌరులు ఎవరైనా ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెడితే ఐదేళ్ల జైలు శిక్ష లేదంటే 66 వేల డాలర్ల (రూ. 49 లక్షలు) జరిమానా విధిస్తామని హెచ్చరించింది. నేటి నుంచే ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

భారత్‌లో 9 వేల మంది ఆస్ట్రేలియన్లు నివసిస్తుండగా, వారిలో కనీసం 600 మందికి కరోనా సోకే ప్రమాదం ఉందని ఆస్ట్రేలియా ప్రభుత్వం అంచనా వేస్తోంది. కాగా, బయో సెక్యూరిటీ చట్టం కింద తీసుకొచ్చిన ఈ సరికొత్త నిబంధనల నుంచి ఐపీఎల్‌లో ఆడుతున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు, శిక్షణ సిబ్బందికి ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు, భారత్ నుంచి వచ్చే ప్రయాణికులను ఆస్ట్రేలియా ఇప్పటికే నిషేధించింది.