ఇన్ని కేసులు ఎప్పుడూ రాలేదు... దయచేసి అర్థం చేసుకోండి... పరీక్షలు వద్దు: రఘురామకృష్ణరాజు

30-04-2021 Fri 21:42
  • ఏపీలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు
  • ఒక్కరోజులో 17 వేలకు పైగా కేసులు
  • నమోదు కానివి ఇంకా ఎన్నో ఉంటాయన్న రఘురామ
  • పరిస్థితులు బాగా లేవని సీఎం జగన్ కు విజ్ఞప్తి
Raghurama Krishna Raju mentions single day highest cases in AP

ఏపీలో రికార్డు స్థాయిలో రోజువారీ కేసులు రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. అధికారికంగా 17,354 పాజిటివ్ కేసులు వచ్చాయని వెల్లడించారు. మన రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవేనని తెలిపారు.

"నమోదు కాని కేసులు, చావులు ఇంకెన్ని ఉంటాయో ఒక్కసారి ఊహించుకోండి. అయ్యా సీఎం జగన్ గారూ, ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ ఏమంత క్షేమకరం కాదు. దయచేసి అర్థం చేసుకోండి" అని హితవు పలికారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. తన ట్వీట్ తో పాటు ఏపీ కరోనా బులెటిన్ ను కూడా పంచుకున్నారు.