Corona Virus: రేపే భారత్‌కు రానున్న స్పుత్నిక్‌-వీ టీకాలు!

Sputnik V Vaccine will reach india by tomorrow
  • భారత్‌లో కరోనా ఉగ్రరూపం
  • రేపటి నుంచి ప్రారంభం కానున్న మూడో విడత వ్యాక్సినేషన్‌
  • 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా
  • వేధిస్తున్న టీకాల కొరత
  • ఈ తరుణంలో స్పుత్నిక్‌ రూపంలో ఊరట
ఓవైపు కరోనా విజృంభణ, మరోవైపు టీకాల కొరత.. భారత్‌ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ తరుణంలో అధికారిక వర్గాలు ఓ ఊరట కలిగించే అంశాన్ని వెల్లడించాయి. భారత్‌లో ఆమోదం పొందిన మూడో వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వీ తొలివిడత టీకాలు రేపు(మే 1) హైదరాబాద్‌కు చేరుకోనున్నట్లు  దౌత్య వర్గాలు వెల్లడించాయి.

రేప‌టి నుంచి 18 ఏళ్లు పైబ‌డిన వారందరికీ వ్యాక్సినేష‌న్ ప్రారంభ‌మ‌వుతున్న విషయం తెలిసిందే. మరో వైపు అనేక రాష్ట్రాలు టీకాల కొరత కారణంగా మూడో విడత వ్యాక్సినేషన్‌ను అమలు చేసే పరిస్థితులు లేవని ప్రకటిస్తున్నాయి. ఈ తరుణంలో రష్యాకు చెందిన స్పుత్నిక్‌-వీ అందుబాటులోకి రానుండడం ఊరటనిచ్చే విషయమనే చెప్పాలి.

1.5 లక్షల నుంచి 2 లక్షల స్పుత్నిక్‌ టీకా వయల్స్‌ భారత్‌కు మే ఆరంభంలో రానున్నట్లు రష్యాలోని భారత రాయబారి బాల వెంకటేశ్‌ వర్మ ఇటీవల తెలిపారు. మరోవైపు స్పుత్నిక్‌-వీ టీకా అభివృద్ధికి నిధులు సమకూర్చిన రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ కిరిల్‌ దిమిత్రివ్‌ ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ.. భారత్‌కు మే 1న టీకాలు చేరుతాయని కొన్ని రోజుల క్రితం తెలిపారు.  

భార‌త్‌లో ఇప్ప‌టికే కొవాగ్జిన్, కొవిషీల్డ్ క‌రోనా టీకాల‌ను ప్ర‌జ‌ల‌కు అందిస్తున్నారు. స్పుత్నిక్-వీ టీకాలు అందుబాటులోకి వ‌స్తే వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ మరింత వేగవంతం కానుందని భావిస్తున్నారు.
Corona Virus
corona vaccine
Sputnik V
Russia
Vaccination

More Telugu News