అంబానీ సన్నిహితుడిగా గుర్తింపు... ఏడాదికి రూ.70 కోట్ల జీతం.. అన్నీ వదిలి సన్యాసం పుచ్చుకున్నాడు!

30-04-2021 Fri 21:06
  • రిలయన్స్ గ్రూపులో ఉపాధ్యక్షుడిగా ప్రకాశ్ షా
  • ముఖేశ్ అంబానీకి నమ్మినబంటుగా గుర్తింపు
  • ఈ నెల 25న సన్యాసం స్వీకరణ
  • జైన మతాచారాలపై ఎనలేని విశ్వాసం
  • భర్త బాటలోనే భార్య నయనా బెన్ సన్యాసం స్వీకరణ
Prakash Shah enters new phase in life

రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యానికి వైస్ ప్రెసిడెంట్ గా సేవలు అందించిన 64 ఏళ్ల ప్రకాశ్ షా ఆశ్చర్యకరంగా సర్వసంగ పరిత్యాగం చేసి సన్యాసిగా మారిపోయారు. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీకి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొంది, ఏడాదికి రూ.70 కోట్ల జీతం తీసుకునే స్థాయిని కూడా వదులుకుని, సన్యాసం పుచ్చుకోవడం సంచలనం సృష్టించింది.

ప్రకాశ్ షా... ముఖేశ్ అంబానీ బాల్యమిత్రులు. ప్రకాశ్ షా కెమికల్ ఇంజినీరింగ్ లో పట్టా అందుకున్నాడు. ఆపై బాంబే ఐఐటీలో పీజీ పూర్తిచేశారు. రిలయన్స్ గ్రూపులో ప్రకాశ్ షా ఎంతో కీలకవ్యక్తిగా ఎదిగారు. ఆయనకు భార్య నయనా బెన్, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక కుమారుడు ఇంతకుముందే సన్యాసం తీసుకున్నాడు.

ప్రకాశ్ షా కూడా ఏప్రిల్ 25న జైన మతాచారాల ప్రకారం సన్యాస దీక్ష స్వీకరించారు. భర్త బాటలోనే భార్య నయన కూడా సన్యాసినిగా మారిపోయారు. ఎంతో సంపద, హోదాను వదులుకుని ఆయన ఆధ్యాత్మికపంథాను ఎంచుకోవడం వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.