హీరో సిద్ధార్థ్ ఆరోపణల్లో ఎంత నిజం ఉందో తెలియదు: తమిళనాడు బీజేపీ

30-04-2021 Fri 20:11
  • తమిళనాడు బీజేపీపై సిద్ధార్థ్ తీవ్ర ఆరోపణలు
  • తన ఫోన్ నెంబరు లీక్ చేశారని వెల్లడి
  • తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని వివరణ
  • ఖండించిన తమిళనాడు బీజేపీ అధికార ప్రతినిధి
Tamilnadu BJP condemns hero Siddarth allegations

ప్రముఖ దక్షిణాది నటుడు సిద్ధార్థ్ తమిళనాడు బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనను చంపేస్తామని, తన కుటుంబ సభ్యులపై అత్యాచారం చేస్తామని బెదిరిస్తున్నారని సిద్ధార్థ్ వెల్లడించాడు. తమిళనాడు బీజేపీ ఐటీ విభాగం తన ఫోన్ నెంబరును లీక్ చేసిందని ఆరోపించాడు. దీనిపై తమిళనాడు బీజేపీ అధికార ప్రతినిధి నారాయణన్ తిరుపతి స్పందించారు.

సిద్ధార్థ్ కు బెదిరింపులు వస్తున్నాయన్న అంశంలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదని వ్యాఖ్యానించారు. అయితే, సిద్ధార్థ్ అదేపనిగా ప్రధాని మోదీని కించపరిచేలా మాట్లాడుతూ తప్పు చేస్తున్నాడని వెల్లడించారు. ఇదే అంశంపై సిద్ధార్థ్ పై తాను ఫిర్యాదు కూడా చేశానని నారాయణన్ తెలిపారు. ఆ కేసు కోర్టులో ఉందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి, హోంమంత్రి, ముఖ్యమంత్రిపైనా వ్యాఖ్యలు చేసి మరోసారి అపరాధి అయ్యాడని అభివర్ణించారు.

అటు, తమిళనాడు బీజేపీ ఐటీ విభాగం అధిపతి నిర్మల్ కుమార్ కూడా సిద్ధార్థ్ ఆరోపణలపై స్పందించారు. సిద్ధార్థ్ కు వస్తున్న బెదిరింపులతో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. సిద్ధార్థ్ వంటి వ్యక్తుల గురించి పట్టించుకోవద్దని బీజేపీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నానని వెల్లడించారు.