మంత్రి ఈటల భూకబ్జాలకు పాల్పడ్డారంటూ రైతుల సంచలన ఆరోపణలు

30-04-2021 Fri 19:12
  • మెదక్ జిల్లాలో తమ భూములు ఆక్రమించుకున్నారని వెల్లడి
  • తన భార్య జమున పేరిట హేచరీస్ నిర్మిస్తున్న ఈటల!
  • హేచరీస్ కోసం తమ భూములు కబ్జా చేశారన్న రైతులు
  • అధికారులకు ఫిర్యాదు
  • విచారణ చేపట్టిన అధికారులు
Land grabbing allegations on Eatala Rajendar

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జాలకు పాల్పడ్డారంటూ మెదక్ జిల్లా రైతులు సంచలన ఆరోపణలు చేశారు. హకీంపేట, అచ్చంపేట గ్రామాల్లో తమ భూములను మంత్రి ఈటల కబ్జా చేశారంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన పలువురు రైతులు ఆరోపించారు. మాసాయిపేట మండలంలో తమ భూమిని కబ్జా చేశారని రైతులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో ఆయా భూముల సర్వే నెంబర్లు కూడా పొందుపరిచారు.

ఈటల తన భార్య జమున పేరిట జమున హేచరీస్ స్థాపిస్తున్నారని, అందుకోసం దాదాపు 100 ఎకరాల అసైన్డ్ భూములను ఆక్రమించుకున్నారని రైతులు వెల్లడించారు. ఈ భూములను తన భార్య జమున, కుమారుడు నితిన్ పేర్ల మీద అధికారులపై ఒత్తిడి తెచ్చి మరీ రిజిస్ట్రేషన్ చేయించారని వివరించారు. కాగా, రైతుల ఫిర్యాదుపై అధికారులు విచారణ చేపట్టారు.