కార్మికులు తమ హక్కుల కోసం రక్తం చిందించిన రోజు మే డే: పవన్ కల్యాణ్

30-04-2021 Fri 18:23
  • ప్రపంచ పురోగతిలో శ్రమజీవుల పాత్ర ఎనలేనిది
  • కష్ట జీవులు మరోసారి పోరాటానికి దిగే పరిస్థితి రాకూడదు
  • కార్మిక లోకానికి 'మే డే' శుభాకాంక్షలు
Pawan Kalyan May Day wishes

రేపు కార్మికుల దినోత్సవం 'మే డే' సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ పురోగతిలో, ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో శ్రమజీవుల పాత్ర ఎనలేనిదని ఈ సందర్భంగా అన్నారు. ఈ అభివృద్ధిలో శ్రామిక సోదరులు ధారపోసిన స్వేద జలానికి ఎంతని విలువ కట్టగలమని ప్రశ్నించారు. కార్మికులు తమ హక్కుల కోసం రక్తం చిందించి, పోరాడి సాధించిన రోజు 'మే డే' అని అన్నారు. తమ శ్రమను గుర్తించండని కష్ట జీవులు పోరాటానికి దిగే పరిస్థితి రాకూడదని చెప్పారు. ప్రతి ఒక్కరూ శ్రమను గుర్తించాలని, అప్పుడే కార్మికుల కళ్లలో నిజమైన ఆనందాన్ని చూస్తామని అన్నారు. కార్మిక లోకానికి, తన తరపున, జనసేన పార్టీ పక్షాన 'మే డే' శుభాంకాంక్షలు తెలుపుతున్నానని చెప్పారు.

పరిశ్రమల్లో, వాణిజ్య సంస్థల్లో పని చేస్తున్న వారి నుంచి అసంఘటిత రంగాల్లో ఉన్న వారందరికీ కార్మిక చట్టాలు పకడ్బందీగా అమలు కావాలన్నది జనసేన పార్టీ ఆకాంక్ష అని పవన్ తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో కార్మికులకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని... ఆ కష్ట జీవుల కుటుంబాలను తక్షణం ఆదుకోవాల్సిన బాధ్యత పాలకులపై ఉందని చెప్పారు. ఆరోగ్యపరంగా వారికి అవసరమైన అన్ని సేవలను సక్రమంగా అందించాలని డిమాండ్ చేశారు.