ఇలా వచ్చి అలా వెళ్లిన 'పుష్ప' విలన్!

30-04-2021 Fri 18:12
  • ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలోని కథ
  • ప్రతినాయకుడిగా ఫహాద్ ఫాజిల్
  • కరోనా కారణంగా ఆగిపోయిన షూటింగ్  

Pushpa Shooting Cancelled

ఇప్పుడు అందరి దృష్టి 'పుష్ప' సినిమాపైనే ఉంది. ఈ సినిమా విశేషాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి అభిమానులు ఉత్సాహం చూపుతున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బన్నీ - రష్మిక నాయకా నాయికలుగా నటిస్తున్నారు. అడవి నేపథ్యంలో సాగే ఎర్రచందనం స్మగ్లింగ్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ సినిమాకి సంబంధించి చాలా వరకూ షూటింగు కానిచ్చారు. కథా పరంగా తెలుగు తెరకి కొత్త విలన్ ను పరిచయం చేయాలని సుకుమార్ భావించాడు. ఇందుకోసం చాలామంది పేర్లను ఆయన పరిశీలించాడు.

చివరికి మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ ను ఎంపిక చేసుకున్నాడు. ఇటీవలే ఆయన కాంబినేషన్ సీన్స్ ను ప్లాన్ చేయడంతో హైదరాబాద్ కి వచ్చాడు. ఫహాద్ - బన్నీ కాంబినేషన్లోని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. అదే సమయంలో బన్నీ కరోనా బారిన పడటంతో, ఆయనకి బ్రేక్ ఇచ్చారు. ఆ తరువాత ఫహాద్ కి సంబంధించిన సీన్స్ ను చిత్రీకరించాలని సుకుమార్ అనుకున్నాడట. కానీ పరిస్థితులు బాగోలేని కారణంగా, తాను చేయలేనని ఫహాద్ చెప్పినట్టుగా తెలుస్తోంది. దాంతో ఆయనను సొంత ఊరుకు పంపించేసి షూటింగ్ ఆపేసినట్టుగా చెప్పుకుంటున్నారు.