Weight Increase: కొంచెం బరువెక్కినా కరోనా ఇబ్బందులు పెరుగుతాయి.. యువతపై తీవ్ర ప్రభావం: తాజా అధ్యయనం

  • బీఎంఐ ఒక్క పాయింట్ పెరిగినా ఇబ్బందులు తప్పవు
  • ఆసుపత్రుల్లో చేరే అవకాశం 5 శాతం పెరుగుతుంది
  • 40 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారికి ఎక్కువ రిస్క్
A Little Extra Weight Also Raises Risk Of Severe Covid

నిర్ధారిత బరువు కంటే కొంత ఎక్కువ బరువున్నా కరోనా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయని ఓ తాజా అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా యువతలో ఈ ఇబ్బంది మరీ ఎక్కువగా ఉంటుందని తెలిపింది. వరుస లాక్ డౌన్ల వల్ల జనాలు ఇళ్లలోనే ఉంటుండటంతో... వారు బరువెక్కుతున్నారు. వీరిపై యూకే రీసెర్చర్లు అధ్యయనం చేశారు.

బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 23 కంటే ఎక్కువ ఉన్నవారు ఇప్పటికే హై రిస్క్ లో ఉన్నారని అధ్యయనంలో వారు తెలిపారు. బీఎంఐ ఒక్క పాయింటు పెరిగినా... ఆసుపత్రుల్లో చేరే అవకాశం 5 శాతం, ఐసీయూలో చేరే అవకాశాలు 10 శాతం పెరుగుతాయని హెచ్చరించారు.

40 కంటే తక్కువ వయసున్న వారికి రిస్క్ ఎక్కువగా ఉంటుందని రీసెర్చర్లు తెలిపారు. ఇతర జాతులతో పోల్చితే నల్లజాతీయులపై కరోనా ప్రభావం అధికంగా ఉంటుందని చెప్పారు. 70 లక్షల మంది హెల్త్ రికార్డులను అధ్యయనం చేసిన తర్వాత వారు ఈ వివరాలను వెల్లడించారు. 80 ఏళ్లు పైబడిన వారు బరువు పెరిగినప్పటికీ... వారిపై ప్రభావం తక్కువగానే ఉంటుందని చెప్పారు. ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలు 'ది లాన్సెట్ డయాబెటీస్ అండ్ ఎండోక్రైనాలజీ' జర్నల్ లో ప్రచురితమయ్యాయి.

More Telugu News