మైక్రోసాఫ్ట్ డిఫాల్ట్ ఫాంట్ గా 'కాలిబ్రి'... 'టైమ్స్ న్యూ రోమన్'ను తొలగించనున్న సంస్థ!

30-04-2021 Fri 10:20
  • అతి త్వరలోనే కొత్త వర్షన్
  • మరో ఐదు ఫాంట్ ఫ్యామిలీలు కూడా విడుదల
  • యూజర్లను అభిప్రాయాలు కోరిన మైక్రోసాఫ్ట్
Calibri is Next Default font for Microsoft

ప్రసిద్ధ సాఫ్ట్ వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్, తన ఆఫీస్ సూట్ లో ఐదు కొత్త ఫాంట్లను చేర్చాలని నిర్ణయించింది. రెడ్ మాండ్ కేంద్రంగా టెక్నాలజీ జెయింట్ గా పని చేస్తున్న మైక్రోసాఫ్ట్ 2007 నుంచి టైమ్స్ న్యూ రోమన్ ను డిఫాల్ట్ ఫాంట్ గా వాడుతుండగా, దాని స్థానంలో కాలిబ్రిని ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. ఇదే సమయంలో బెయిర్ స్టాడ్ట్, గ్రాండ్ వ్యూ, సీ ఫోర్డ్, స్కీనా, టెనోరైట్ ఫాంట్లను కూడా చేర్చింది. సమీప భవిష్యత్తులో డిఫాల్ట్ ఫాంట్ ను మార్చాలని నిర్ణయించామని, యూజర్లు తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరింది.

ఈ మేరకు తన బ్లాగ్ లో మైక్రోసాఫ్ట్ ఓ పోస్ట్ పెడుతూ, కొత్త ఫాంట్లన్నీ సాన్స్ సిరీఫ్ ఫాంట్లలో పలురకాల స్టయిల్స్ ఉంటాయని, మైక్రోసాఫ్ట్ సపోర్ట్ వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. యూజర్లు తమ అభిప్రాయాలను ట్విట్టర్ మాధ్యమంగా తెలియజేయాలని, వాటిని పరిశీలించిన తరువాత నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది.

కాగా, ఈ సంవత్సరం ఆరంభంలోనే ఆఫీస్ 2021, ఆఫీస్ 2021 ఎల్టీఎస్సీ వర్షన్లను త్వరలోనే విడుదల చేస్తామని పేర్కొంది. అయితే ఎప్పుడు విడుదల చేస్తామన్న విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పలేదు. ఆఫీస్ 2019 విజయవంతమైన తరువాత కొన్ని మార్పులు చేర్పులతో కొత్త వర్షన్ ను సిద్ధం చేసింది.