గాంధీ ఆసుపత్రిలో దయనీయ స్థితి.. వందల సంఖ్యలో పేరుకుపోతున్న మృతదేహాలు!

30-04-2021 Fri 07:01
  • ‘గాంధీ’ మార్చురీలో 300 మృతదేహాలు
  • ప్రతి రోజు 40-50 మంది కొవిడ్ రోగుల మృత్యువాత
  • మృతదేహాల అప్పగింత నిబంధనలు సరళతరం చేయాలంటున్న బాధిత కుటుంబ సభ్యులు
300 dead bodies in secunderabad gandhi hospital martury

సికింద్రాబాద్  గాంధీ ఆసుపత్రిలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. కరోనాతో, ఇతర వ్యాధులతో  ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న రోగుల్లో పరిస్థితి విషమించి రోజుకు 40-50 మంది మృత్యువాత పడుతున్నారు. ఇలా చనిపోతున్న వారి మృతదేహాలతో ఆసుపత్రి మార్చురీ నిండిపోతోంది. కొంతమంది మాత్రమే తమ వారి మృతదేహాలను తీసుకుని కర్మకాండలు జరిపిస్తుండగా, మిగతా వారు వాటిని మార్చురీలోనే వదిలేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు ఇక్కడ 300 మృతదేహాలు పేరుకుపోయాయి.

శవాలు ఇలా పేరుకుపోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగరంలో 800కు పైగా శ్మశానాలు ఉంటే నాలుగింటికే పంపిస్తుండడం, మృతదేహాల అప్పగింతలో నిర్లక్ష్యం వంటి కారణంగానే ఈ పరిస్థితులు తలెత్తినట్టు చెబుతున్నారు. దీనికితోడు నగరంలోని శ్శశాన వాటికలో దహనం చేయాలంటే రూ. 25 వేలు, స్వగ్రామాలకు తరలించి అంత్యక్రియలు చేయాలంటే దాదాపు 50 వేలకు పైగా ఖర్చవుతోంది. దీంతో అంత ఖర్చు భరించలేని వారు వాటిని మార్చురీలోనే వదిలేస్తున్నారు. కాబట్టి మృతదేహాల అప్పగింతకు సంబంధించిన నిబంధనలు సరళతరం చేయాలని పలువురు కోరుతున్నారు. అలాగే, కొవిడ్ మృతుల దహనాల కోసం మరిన్ని శ్మశానాలను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.