కరోనా బాధితులు మూడు పొరల మాస్క్‌ ధరించాల్సిందే.. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి కేంద్రం తాజా మార్గదర్శకాలు

29-04-2021 Thu 19:33
  • కరోనా బాధితుడు ఉండే గది వెంటిలేషన్‌ బాగుండాలి
  • ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి
  • రోజుకు రెండు సార్లు ఆవిరి పట్టాలి
  • దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలుంటే వైద్యుల సమీక్ష తప్పనిసరి
Centre released new Guidelines for Home Isolation

హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా బాధితులు పాటించాల్సిన జాగ్రత్తలు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. వారు తీసుకోవాల్సిన ఆహారం, ఔషధాలు సహా.. ఇంట్లోని ఇతరులకు వైరస్‌ వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించింది.

* కరోనా బాధితుడు ఉండే గది వెంటిలేషన్‌ బాగుండాలి. అన్ని కిటికీలు తెరిచి ఉంచాలి.
* అన్ని సమాయల్లో బాధితుడు మూడు పొరల మాస్కు ధరించాలి. ఒకవేళ ఇంట్లోవారు ఎవరైనా ఆయనకు సేవలందిస్తున్నట్లయితే ఇద్దరూ విధిగా ఎన్‌95 మాస్కులను ధరించాలి. అవసరమైతే వాటిని 8 గంటల్లో తొలగించేయాలి.
*  ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. శరీర ఉష్ణోగ్రత, హృదయ స్పందనలు, ఆక్సిజన్‌, శ్వాస సంబంధిత ఇబ్బందులను తరచూ చెక్‌ చేసుకుంటూ ఉండాలి.
* 60 ఏళ్లు పైబడి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కరోనా బాధితులు వైద్యుల పూర్తి స్థాయి సమీక్ష తర్వాతే హోం ఐసోలేషన్‌లో ఉండాలి.
* వేడినీటితో పుక్కిలించాలి. రోజుకు రెండు సార్లు ఆవిరి పట్టాలి.
* జ్వరం ఎక్కువగా ఉంటే పారాసిటమాల్‌ 650ఎంజీ రోజుకు నాలుగు సార్లు తీసుకోవాలి. అయినా తగ్గకపోతే వైద్యుల సలహా తీసుకుని ఇతర ఔషధాలు వాడాలి.
* ఐవర్‌మెక్టిన్‌ 20ఎంసీజీ/కేజీ మాత్రలు పరగడుపున 3-5 రోజుల పాటు తీసుకోవాలి.
* ఓరల్‌ స్టెరాయిడ్స్‌, రెమ్‌డెసివిర్‌ ఇంట్లో వాడరాదు.
* ఇలా 10 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉన్న తర్వాత వరుసగా మూడు రోజుల పాటు జ్వరం, ఇతర లక్షణాలు లేనట్లయితే ఈ జాగ్రత్తలను నిలిపివేయవచ్చు.