ఉత్తరప్రదేశ్ లో రేపటి నుంచి లాక్ డౌన్

29-04-2021 Thu 15:17
  • రేపు సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు లాక్ డౌన్
  • కరోనా కేసులు పెరుగుతున్నందువల్ల లాక్ డౌన్ పెడుతున్నామని ప్రభుత్వ ప్రకటన
  • కరోనా వల్ల ఇప్పటి వరకు 11,943 మంది మృతి
Lockdown in UP from tomorrow evening

కరోనా కేసులు భారీగా నమోదవుతున్న తరుణంలో కుంభమేళాను నిర్వహించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దానికి తగిన మూల్యం చెల్లించుకుంటోంది. ఆ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి అక్కడి యోగి ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది. రేపు సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం 7 గంటల వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే లాక్ డౌన్ విధిస్తున్నట్టు వెల్లడించింది.

నిన్న ఒక్కరోజే ఉత్తరప్రదేశ్ లో 29,824 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 11,82,848కి చేరుకుంది. నిన్న 266 మంది కరోనా కారణంగా మృతి చెందారు. వీటితో కలిపి ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 11,943కి చేరుకుంది.