కరోనా విలయంపై కేంద్రాన్ని విమర్శించే దమ్ములేక రాష్ట్రాన్ని ఆడిపోసుకుంటున్నాడు: చంద్రబాబుపై విజయసాయి ధ్వజం

29-04-2021 Thu 14:52
  • కరోనా కట్టడిలో ఏపీ ముందంజలో ఉందన్న విజయసాయి
  • చంద్రబాబు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడని విమర్శలు
  • ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని ఆగ్రహం
  • మొదట బాబుపైనే కేసు బుక్ చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యలు
Vijayasai hits out Chandrababu allegations

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. కరోనా విలయంపై కేంద్రాన్ని, విఫలమైన పెద్ద రాష్ట్రాలను విమర్శించే దమ్ములేక ఏపీ ప్రభుత్వాన్ని ఆడిపోసుకుంటున్నాడని మండిపడ్డారు. కరోనా పరీక్షలు, వ్యాక్సినేషన్, ఆక్సిజన్ నిల్వలు, పడకల సంఖ్య పెంపు, రికవరీ రేటు అంశాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉన్నప్పటికీ చంద్రబాబు విమర్శలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీ ప్రజలను ఇతర రాష్ట్రాలు అనుమతించడంలేదని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడని, ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు జరగడంలేదనేది పచ్చి అబద్ధమని విజయసాయి పేర్కొన్నారు. కరోనాపై ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే వారిపై క్రిమినల్ కేసులు పెట్టాల్సి వస్తే మొదట చంద్రబాబునే బుక్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.  

బాబు మీడియా సమావేశం చూస్తే, ఆయన అసలు బాధంతా వైజాగ్ లో పల్లా అక్రమ నిర్మాణం కూల్చివేత, సంగం డెయిరీలో వందల కోట్లు మేసి పాడిరైతుల రక్తం పీల్చిన ధూళిపాళ్ల అరెస్ట్ పై ఏడవడానికే అని తెలిసిపోతుందని ఎద్దేవా చేశారు. కరోనా వేళ దొంగలు దొరికినా వదిలిపెట్టాలని పత్తి గింజలా నీతి చంద్రికలు చెబుతున్నాడని విమర్శించారు.