Etela Rajender: వ్యాక్సిన్లు, ఇంజెక్షన్లు అన్నీ కేంద్రం చేతిలో పెట్టుకుని మమ్మల్ని విమర్శించడం సరికాదు: ఈటల రాజేందర్

  • కరోనా విషయంలో రాష్ట్రాలకు  కేంద్రం పెద్దగా చేసిందేమీ లేదు
  • పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న వారివల్లే కరోనా కేసులు పెరుగుతున్నాయి
  • వచ్చే నెలలో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉంది
Center criticising our govt is not good says Etela Rajender

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని రాష్ట్ర ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. కరోనా విషయంలో రాష్ట్రాలకు ఇప్పటి వరకు కేంద్రం పెద్దగా చేసిందేమీ లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆదేశాలనే రాష్ట్రం పాటిస్తోందని చెప్పారు. వ్యాక్సిన్లు, ఇంజెక్షన్లను కేంద్రం తన చేతిలోనే పెట్టుకుందని అన్నారు. చేయాల్సిన తప్పులన్నింటినీ చేస్తూ... తమను కేంద్ర పెద్దలు నిందించడం సరికాదని చెప్పారు.

ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులపై కేంద్రం సమాధానం చెప్పాలని ఈటల డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు సంబంధించిన కేసులు, మరణాలపై తప్పుడు సమాచారాన్ని వెల్లడిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు పొరుగున ఉన్న ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుంటారని... అందుకే ఇక్కడ కేసులు పెరుగుతున్నాయని చెప్పారు.

రాష్ట్రంలో 18 ఏళ్లకు పైబడిన యువకులు 1.7 కోట్ల మంది ఉన్నారని... వీరికి రెండు డోసుల చొప్పున మూడు కోట్లకు పైగా డోసులు అవసరమవుతాయని ఈటల తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 19 డయాగ్నోస్టిక్ సెంటర్లలో అన్ని పరీక్షలను నిర్వహించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని చెప్పారు. వచ్చే నెలలో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని... దీంతో, రాష్ట్రానికి సరఫరా చేసే ఆక్సిజన్ ను 600 మెట్రిక్ టన్నులకు పెంచాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు. రాష్ట్రాల పట్ల కేంద్రం బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు.

  • Loading...

More Telugu News