COVID19: ఆక్సిజన్​ వినియోగంలో ఆదర్శం ఈ ఆసుపత్రి!

  • రాజస్థాన్ భిల్వారా ఆసుపత్రిలో ముందే ప్రణాళిక
  • పరిస్థితిని ఊహించి ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు
  • రోజూ 100 సిలిండర్ల మేర ప్రాణ వాయువు ఉత్పత్తి
  • ఆక్సిజన్ సరఫరాకే ప్రత్యేకంగా ఓ టీమ్
  • నిరంతరాయంగా సరఫరా చేస్తున్న ఆసుపత్రి
  • 8 వేల మంది పేషెంట్లకు ఆక్సిజన్
Known for its containment model once Bhilwara is setting another example with oxygen supply management

దేశమంతా ఆక్సిజన్ కొరత తీవ్ర రూపం దాల్చినా.. అక్కడ మాత్రం ఏ ఒక్క రోగికీ ఆక్సిజన్ అందకపోవడమన్నది జరగలేదు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. 8 వేల మంది పేషెంట్లకు నిరంతరాయంగా ఆక్సిజన్ ను సరఫరా చేస్తూ శెభాష్ అనిపించుకుంటోంది. అంతకుముందు మొదటి వేవ్ లోనూ అత్యంత కఠినమైన లాక్ డౌన్ నిబంధనలను విధించి తనకంటూ పేరు తెచ్చుకుంది ఆ పట్టణం. ఇప్పుడు ఆక్సిజన్ వినియోగంలోనూ అక్కడి ఆసుపత్రి ఆదర్శంగా నిలుస్తోంది. అదే రాజస్థాన్ లోని భిల్వారా పట్టణం.


భిల్వారాలో430 పడకల మహాత్మా గాంధీ జిల్లా ఆసుపత్రి ఉంది. అందులో 300 మంది దాకా కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. బెడ్లన్నీ నిండిపోయినా ఆక్సిజన్ మాత్రం నిండుకోలేదు. కారణం.. వైరస్ కట్టడికి ఆ ఆసుపత్రి గీసుకున్న రక్షణ వలయమే. అవును, ఆక్సిజన్ కొరత రాకుండా ఎక్కడికక్కడ చర్యలు చేపట్టింది. ఇలాంటి పరిస్థితి ముందే వస్తుందని గ్రహించి ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని, వెంటనే ప్రభుత్వం ఆక్సిజన్ ప్లాంటును ఏర్పాటు చేయించిందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ్ గౌర్ వెల్లడించారు.


అప్పుడు తీసుకున్న ఆ చర్యల ఫలితమే ఇప్పుడు తమకు ఆక్సిజన్ కొరత లేకుండా చేసిందని చెప్పారు. ప్రతి రోజూ 100 సిలిండర్లకు పైగా ఆక్సిజన్ ను తమ ప్లాంట్ ఉత్పత్తి చేస్తుందని చెప్పారు. మొన్నటిదాకా ఆసుపత్రికి రోజూ 30 నుంచి 40 సిలిండర్లు మాత్రమే అవసరమయ్యేవని, కానీ, ఇప్పటి పరిస్థితుల్లో 400 నుంచి 450 దాకా అవసరమవుతున్నాయని అన్నారు. ఇక్కడ ఉత్పత్తి అయినవి పోనూ మిగతా వాటిని వేరే ప్రాంతాల నుంచి తెప్పిస్తున్నామని ఆయన వివరించారు.

ఇప్పుడు తమకున్న అత్యంత ముఖ్యమైన కర్తవ్యం ఆక్సిజన్ ను ఆదా చేయడమేనని చెప్పారు. అందు కోసం ముగ్గురు డాక్టర్లు, ముగ్గురు సాంకేతిక నిపుణులతో ఓ టీమ్ ను ఏర్పాటు చేశామని, ఆ టీమ్ ఎప్పటికప్పుడు కేంద్రీకృతమైన ఆక్సిజన్ పాయింట్లను పరిశీలిస్తుందని చెప్పారు. తద్వారా రోజులో ఎప్పుడూ ఆక్సిజన్ ను నిరంతరాయంగా సరఫరా చేస్తున్నామన్నారు.

అవసరాన్ని బట్టి అత్యధిక, అత్యల్ప పరిమితులను విధించామని చెప్పారు. ఆక్సిజన్ శాతం 93 నుంచి 94 మధ్య ఉన్న వారికి 2 లీటర్ల ఆక్సిజన్ ను ఇస్తున్నామన్నారు. చాలా కేసుల్లో అలాంటి వ్యక్తులకు ఆక్సిజన్ అవసరం ఉండదన్నారు. తమకున్న పరిమిత వనరుల్లోనే పరిస్థితి విషమించిన రోగులకే ఆక్సిజన్ ఇవ్వడంలో ప్రాధాన్యం పెట్టుకున్నామని వివరించారు. ఆసుపత్రిలో బెడ్లు అయిపోయినా వచ్చే పేషెంట్లకు చికిత్స అందించడం కోసం ఆసుపత్రి బయట ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసింది.

More Telugu News