ధూళిపాళ్ల నరేంద్రకు షాక్.. పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు!

29-04-2021 Thu 11:31
  • తనకు రిమాండ్ విధించడంపై నరేంద్ర పిటిషన్
  • కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీకి హైకోర్టు ఆదేశం
  • తదుపరి విచారణ మే 5కు వాయిదా
AP High Court dismisses Dhulipala Narendra petition

తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. తనకు రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ ఆయన వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసుకు సంబంధించి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఏసీబీని ఆదేశించింది. తదుపరి విచారణను మే 5వ తేదీకి వాయిదా వేసింది.

ధూళిపాళ్ల నరేంద్ర ఛైర్మన్ గా ఉన్న సంగం డెయిరీలో అవినీతి, అవకతవకలు చోటు చేసుకున్నాయంటూ ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. సంగం డెయిరీలో సోదాలు  నిర్వహించిన ఏసీబీ అధికారులు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నరేంద్రను పోలీసులు అరెస్ట్ చేసి... కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆయనకు రిమాండ్ విధించడంతో...రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. మరోవైపు, నరేంద్ర అరెస్ట్ పై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. సంగం డెయిరీని అమూల్ సంస్థకు అప్పజెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు. డెయిరీని అడ్డదారిలో ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.