బెంబేలెత్తుతున్న బెంగళూరు.. 24 గంటల్లో ఏకంగా 22 వేలకు పైగా పాజిటివ్ కేసులు!

28-04-2021 Wed 21:19
  • గత 24 గంటల్లో కర్ణాటకలో 39,047 కేసుల నమోదు
  • బెంగళూరులోనే 22,596 పాజిటివ్ కేసులు
  • ప్రమాద ఘంటికలు మోగుతున్నాయన్న హైకోర్టు
Bengaluru Records Steep Rise In Covid Cases

భారత ఐటీ రంగానికి కేంద్ర స్థానంగా ఉన్న బెంగళూరు నగరంపై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. కరోనా దెబ్బకు గ్రీస్ సిటీ విలవిల్లాడుతోంది. గత 24 గంటల్లో కర్ణాటక వ్యాప్తంగా 39,047 పాజిటివ్ కేసులు నమోదు కాగా... అందులో 22,596 కేసులు బెంగళూరులోనే నమోదు కావడం అక్కడి పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది. భారీగా పెరిగిపోతున్న కేసులతో నగరంలోని ఆరోగ్య రంగం మొత్తం చేతులెత్తేసే ప్రమాదం నెలకొంది.

ప్రస్తుతం కర్ణాటకలో మూడు లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉండగా... అందులో రెండు లక్షల యాక్టివ్ కేసులు బెంగళూరులోనే ఉన్నాయి. దీనిపై కర్ణాటక హైకోర్టు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రమాదకర ఘంటికలు మోగుతున్నాయని వ్యాఖ్యానించింది. బెంగళూరు ఆసుపత్రుల్లో కరోనా పేషెంట్లకు సరిపడా బెడ్లు కూడా లేవని చెప్పింది.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి యడియూరప్ప ఈరోజు స్పందిస్తూ... కరోనా చైన్ ను బ్రేక్ చేసేందుకు ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. కరోనాను వ్యాప్తిని అడ్డుకునేందుకు విధించిన రెండు వారాల లాక్ డౌన్ ప్రారంభమైందని చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప గడప దాటొద్దని హెచ్చరించారు. అందరం కలిసి మహమ్మారిని ఓడిద్దామని పిలుపునిచ్చారు.