Telangana: అనుమానాలతో టెస్టులు చేయించుకోవడానికి వచ్చి కరోనా అంటించుకుంటున్నారు: తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్
- రాబోయే 3, 4 వారాలు కీలకం
- ఇప్పటి వరకు 45 లక్షల మందికి పైగా వ్యాక్సిన్లు తీసుకున్నారు
- అనవసరంగా పరీక్ష కేంద్రాల వద్ద బారులు తీరవద్దు
కరోనా విషయంలో మహారాష్ట్ర, కర్ణాటకలాంటి రాష్ట్రాల కంటే తెలంగాణ పరిస్థితి చాలా బాగుందని రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. అయితే రాబోయే 3, 4 వారాలు చాలా కీలకమని ఆయన హెచ్చరించారు. 100 సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి విపత్తులు సంభవిస్తాయని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 45 లక్షల మందికి పైగా వ్యాక్సిన్లు తీసుకున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో దశలవారీగా అందరికీ వ్యాక్సిన్ వేస్తామని తెలిపారు. రాష్ట్రంలో 90 శాతం మంది మాస్కులు ధరిస్తున్నారని చెప్పారు.
కరోనా గురించి ఆందోళన చెందాల్సి అవసరం లేదని డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కోవిడ్ లక్షణాలు ఉంటేనే కరోనా ఉన్నట్టని.. అనవసరంగా కోవిడ్ పరీక్ష కేంద్రాల వద్ద బారులు తీరవద్దని చెప్పారు. కరోనా లక్షణాలు ఉన్న ఎందరో భయంతో పరీక్షలకు రావడం లేదని... కోవిడ్ లేని వారు అనుమానాలతో పరీక్షలకు వచ్చి, కరోనాను తెచ్చుకుంటున్నారని అన్నారు. కరోనా లక్షణాలు కేవలం రెండు, మూడు రోజులు మాత్రమే ఉంటాయని... ఆ తర్వాత కూడా తగ్గకపోతేనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. 80 శాతం మంది కరోనా పేషెంట్లకు ఆసుపత్రులు అవసరం లేదని... డాక్టర్ల సలహాతో ఇంట్లోనే ఉండి మందులు వాడుతూ కోలుకోవచ్చని చెప్పారు.