సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈఓ అదర్‌ పూనావాలకు వై కేటగిరీ భద్రత!

28-04-2021 Wed 20:38
  • కేంద్రం హోంశాఖ నిర్ణయం
  • పునావాలాకు బెదిరింపుల నేపథ్యంలోనే
  • అమిత్‌ షాకు లేఖ రాసిన సీరం ఇన్‌స్టిట్యూట్‌
  • కొవిషీల్డ్‌ టీకా ధరలపై విమర్శలు
  • రాష్ట్రాలకు తగ్గించిన సీరం ఇన్‌స్టిట్యూట్‌
Serum CEO to get Y Category Security

కరోనా టీకా కొవిషీల్డ్‌ తయారీ సంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈఓ అదర్‌ పూనావాలాకు సీఆర్‌పీఎఫ్‌ బలగాల చేత వై కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆయనకు రక్షణగా నిరంతరం ఇద్దరు కమాండోలు సహా మొత్తం 11 మంది భద్రతా సిబ్బంది ఉండనున్నారు.

కొవిషీల్డ్‌ సరఫరాకు సంబంధించి పూనావాలాకు బెదిరింపులు వస్తున్నాయని తెలుపుతూ ఏప్రిల్‌ 16న సీరం సంస్థలోని గవర్నమెంట్‌ రెగ్యులేటరీ అఫైర్స్‌ విభాగం డైరెక్టర్‌ ప్రకాశ్‌ కుమార్‌ సింగ్‌ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాకు లేఖ రాశారు. వెంటనే పూనావాలాకు భద్రత కల్పించాలని కోరారు. మహమ్మారిని అంతమొందించేందుకు మోదీ నాయకత్వంలో భారత ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నామని లేఖలో ప్రకాశ్‌ సింగ్‌ పేర్కొన్నారు.

భారత్‌లో అందుబాటులోకి వచ్చిన రెండు కరోనా టీకాల్లో కొవిషీల్డ్‌ ఒకటి. దీన్ని ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా రూపొందించగా.. భారత్‌లోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఉత్పత్తి చేస్తోంది. మే 1 నుంచి దేశవ్యాప్తంగా 18 ఏళ్ల పైబడిన వారందరికీ టీకా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే కొవిషీల్డ్‌ ధరలపైనా దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.

రాష్ట్ర ప్రభుత్వాలకు అందించే ధరను తగ్గించాలని డిమాండ్లు వినిపించాయి. ఆ మేరకు ఒక డోసు ధరను తొలుత నిర్ణయించిన రూ.400 నుంచి రూ.300 తగ్గిస్తూ సీరం బుధవారం నిర్ణయించింది. ఈ పరిణామాల నేపథ్యంలో పూనావాలాకు కేంద్రం వై కేటగిరీ భద్రత కల్పించడం ప్రాధాన్యం సంతరించుకుంది.