Serum: కొవిషీల్డ్ వ్యాక్సిన్ ధరలు తగ్గించిన సీరం సంస్థ

  • గతంలో కొవిషీల్డ్ ధర రూ.400
  • రాష్ట్రాలకు ఇకపై రూ.300కే ఇస్తామని సీరం ప్రకటన
  • తగ్గించిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడి
  • కొవిషీల్డ్ ను భారత్ లో ఉత్పత్తి చేస్తున్న సీరం
Serum cuts the price of Covishield corona vaccine in India

కరోనా సెకండ్ వేవ్ మహోగ్రరూపం దాల్చిన నేపథ్యంలో వ్యాక్సిన్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇటీవలి వరకు వ్యాక్సిన్లపై విముఖత కనబర్చిన ప్రజలు నేడు వ్యాక్సిన్ కేంద్రాలకు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో, కొవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తిదారు సీరం ఇన్ స్టిట్యూట్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ వ్యాక్సిన్ ధరలు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. రాష్ట్రాలకు కొవిషీల్డ్ వ్యాక్సిన్ ను రూ.300కే ఇవ్వాలని నిర్ణయించింది. గతంలో ఈ ధర రూ.400 కాగా, వంద రూపాయలు తగ్గిస్తున్నట్టు సీరం వెల్లడించింది. తగ్గింపు ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. దీనిపై సీరం సంస్థ అధినేత అదర్ పూనావాలా ట్విట్టర్ లో ఓ ప్రకటన చేశారు.

కొవిషీల్డ్ టీకాను బ్రిటన్ కు చెందిన ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, ప్రముఖ ఫార్మా సంస్థ ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. భారత్ లో క్లినికల్ పరీక్షల అనంతరం కొవిషీల్డ్ కు అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు చేశారు. భారత్ లో అమలు చేస్తున్న కరోనా వ్యాక్సినేషన్ లో కొవాగ్జిన్ (భారత్ బయోటెక్) తో పాటు కొవిషీల్డ్ ను కూడా ఇస్తున్నారు.

More Telugu News