ప్రియాంకాచోప్రా వల్ల నాకు అవకాశాలు రాలేదు: మీరా చోప్రా

28-04-2021 Wed 15:24
  • బాలీవుడ్ లో అడుగుపెట్టినప్పుడు ప్రియాంక సోదరి వచ్చిందనే ప్రచారం జరిగింది
  • ప్రియాంక వల్ల కెరీర్ పరంగా లాభించింది ఏమీ లేదు
  • ఆమె వల్ల కొంత గుర్తింపు మాత్రం వచ్చింది
Did not get any offers due to Priyanka Chopra says Meera Chopra

తన కజిన్, బాలీవుడ్ నటి ప్రియాంకచోప్రా వల్ల తాను సినీ అవకాశాలను కోల్పోయానంటూ నటి మీరా చోప్రా తెలిపారు. తెలుగులో పవన్ కల్యాణ్ చిత్రం 'బంగారం'తో పాటు,'వాన' తదితర చిత్రాల్లో కూడా ఆమె నటించి, మెప్పించారు. 2005లో బాలీవుడ్ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన మీరా... ఆ తర్వాత పలు చిత్రాలలో నటించారు. తాజాగా జూమ్ టీవీతో ఆమె మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

తాను బాలీవుడ్ లో అడుగుపెట్టినప్పుడు... ప్రియాంక సోదరి వచ్చిందంటూ ఎంతో ప్రచారం జరిగిందని మీరా తెలిపారు. అయితే తాను ఆమెతో ఎలాంటి కంపారిజన్స్ పెట్టుకోలేదని చెప్పారు. ప్రియాంక వల్ల తనకు అదనంగా ఎలాంటి అవకాశాలు రాలేదని తెలిపారు. తనకు అవకాశాలిచ్చే నిర్మాతలు కావాలని... కానీ, ప్రియాంక వల్ల తనకు పని దొరకలేదని చెప్పారు. ప్రియాంక బంధువుని అయినంత మాత్రాన తనకు కెరీర్ పరంగా లాభించింది ఏమీ లేదని అన్నారు. ఇది కూడా తనకు మేలే చేసిందని... అందరూ తనను ఆమె సోదరిగా కాకుండా, ప్రత్యేకంగా చూశారని చెప్పారు.

అయితే, ప్రియాంక వల్ల సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చినట్టు తనకు గుర్తింపు వచ్చిందని... ఆమె వల్ల తనకు కలిగిన లబ్ధి అంతేనని మీరా తెలిపారు. ఈ గుర్తింపు కూడా లేకపోతే తాను చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేదని అన్నారు. మీరా చివరిసారిగా 'సెక్షన్ 375' అనే వెబ్ సిరీస్ లో కనిపించారు. ప్రస్తుతం అర్జున్ రాంపాల్ తో కలిసి 'నాస్తిక్' అనే చిత్రంలో ఆమె నటించబోతున్నారు.