లాక్​ డౌన్​ ప్రకటించిన మరో రాష్ట్రం

28-04-2021 Wed 14:50
  • గోవాలో రేపట్నుంచి మే 3 దాకా సర్వం బంద్
  • అత్యవసరాలు, నిత్యవసరాలకు అనుమతి
  • పారిశ్రామిక కార్యకలాపాలకూ పర్మిషన్
  • ప్రజా రవాణా వ్యవస్థ నిలిపివేత
Another State Announces Lock Down This time Its Goa

లాక్ డౌన్ విధించిన రాష్ట్రాల జాబితాలో మరో రాష్ట్రం చేరింది. కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండడంతో గోవా కూడా లాక్ డౌన్ విధించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఈ రోజు మధ్యాహ్నం లాక్ డౌన్ పై ప్రకటన చేశారు. గురువారం సాయంత్రం 7 గంటల నుంచి లాక్ డౌన్ అమల్లోకి వస్తుందని, మే 3 దాకా ఐదు రోజులపాటు కొనసాగుతుందని ఆయన ప్రకటించారు. లాక్ డౌన్ కాలంలో కేవలం అత్యవసర, నిత్యావసర సేవలు, పారిశ్రామిక కార్యకలాపాలు మాత్రమే కొనసాగుతాయని స్పష్టం చేశారు.

ప్రజా రవాణా వ్యవస్థను పూర్తిగా నిలిపేస్తున్నట్టు ప్రకటించారు. కాసినోలు, హోటళ్లు, పబ్ లనూ పూర్తిగా మూసేస్తున్నట్టు వెల్లడించారు. నిత్యవసరాల రవాణా కోసం రాష్ట్ర సరిహద్దులను తెరిచే ఉంచుతామని చెప్పారు. ప్రస్తుతం గోవాలో రోజూ 2 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే 31 మంది చనిపోగా, 2,110 మంది మహమ్మారి బారిన పడ్డారు. దీంతో మొత్తంగా ఆ రాష్ట్రంలో 81,908 మంది కరోనా బారిన పడగా.. 1,086 మంది చనిపోయారు.