'లవ్ స్టోరీ'పై ఆగని శేఖర్ కమ్ముల కసరత్తు!

27-04-2021 Tue 19:12
  • 'ఫిదా' తరువాత సినిమాగా 'లవ్ స్టోరీ'
  • మరోసారి అలరించనున్న సాయిపల్లవి
  • పరిస్థితులు అనుకూలించాకనే విడుదల  

Sekhar kammula is still working on Love Story

శేఖర్ కమ్ముల నుంచి ప్రేమకథా చిత్రంగా వచ్చిన 'ఫిదా' అనూహ్యమైన విజయాన్ని సాధించింది. ఆ తరువాత ఆయన 'లవ్ స్టోరీ' సినిమాను రూపొందించాడు. 'ఫిదా' సినిమా మాదిరిగానే ఈ సినిమాను కూడా నిజామాబాద్ పరిసరాల్లో చిత్రీకరించడం విశేషం. చైతూ - సాయిపల్లవి కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమాను ఈ నెల 16వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా ఈ సినిమా కూడా వాయిదా పడింది. పరిస్థితులు అనుకూలించాక ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

ఇక 'లవ్ స్టోరీ' సినిమా విడుదల వాయిదా పడింది కనుక, శేఖర్ కమ్ముల మరో కథపై కూర్చుని ఉంటాడని ఆయన అభిమానులు అనుకోవడం సహజం. కానీ కొత్త కథ జోలికి ఆయన వెళ్లనే లేదట. 'లవ్ స్టోరీ' సినిమానే ఒకటికి రెండు సార్లు చూస్తూ, కొన్ని సన్నివేశాలను మరింత ట్రిమ్ చేస్తూ వచ్చాడట. అలా ఓ పది నిమిషాల నిడివిని తగ్గించాడని అంటున్నారు. ఇప్పుడు 'లవ్ స్టోరీ' విషయంలో ఆయన పూర్తి సంతృప్తిగా ఉన్నాడని చెప్పుకుంటున్నారు. 'ఫిదా' తరువాత మళ్లీ సాయిపల్లవితో చేసిన సినిమా కావడంతో అందరిలోనూ ఆసక్తి ఉంది.