'ఖుషి'కి 20 ఏళ్లు .. స్పందించిన భూమిక!

27-04-2021 Tue 18:41
  • 'ఖుషి'తో నాకు ఉత్తమనటి అవార్డు వచ్చింది
  • మా పాత్రలను ఇప్పటికీ ఎవరూ మరిచిపోలేదు
  • ఆ పాటలంటే నాకు చాలా ఇష్టం  

20 Years for Khushi movie

పవన్ కల్యాణ్ .. భూమిక కాంబినేషన్లో వచ్చిన 'ఖుషి' .. నేటితో 20 ఏళ్లను పూర్తిచేసుకుంది. అప్పట్లో ఈ సినిమా యూత్ ను ఒక ఊపు ఊపేసింది. ఎస్.జె. సూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, ఎ.ఎమ్. రత్నం నిర్మాతగా వ్యవహరించాడు. ఇటు పవన్ కెరియర్లోను .. అటు భూమిక కెరియర్లోను ఈ సినిమా చెప్పుకోదగినదిగా నిలిచింది. స్టార్ డమ్ పరంగా ఇద్దరినీ కూడా ఓ రెండు మెట్లు పైకి ఎక్కించిన సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సీన్స్, ఆయా టీవీ షోలలో స్కిట్లుగా కనిపిస్తుంటాయి. దీనిని బట్టి ఈ సినిమా ఎంతగా ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవచ్చు.

తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమాను గురించి భూమిక స్పందించారు. "నేను చేసిన సినిమాల్లో 'ఖుషి' అంటే నాకు చాలా ఇష్టం. ఉత్తమనటిగా నాకు ఈ సినిమా అవార్డు తెచ్చిపెట్టింది. అప్పుడే ఈ సినిమా చేసి 20 ఏళ్లు అయిందా? అనే ఆశ్చర్యం కలుగుతోంది.  పవన్ పోషించిన 'సిద్ధు' .. నేను చేసిన 'మధు' పాత్రలు ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తుండటం విశేషం. పీసీ శ్రీరామ్ గారు నన్ను ఎంతో అందంగా చూపించారు. 'అమ్మాయే సన్నగా' .. 'చెలియ చెలియా' పాటలంటే నాకు చాలా ఇష్టం. పవన్ కల్యాణ్ ఎంతో బాగా చేశారు. ఇంతకాలమైనా ఈ సినిమాను గురించి మాట్లాడుకుంటున్నందుకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు.