Karnataka: ఈ రాత్రి నుంచే కర్ణాటకలో లాక్ డౌన్.. వేటికి అనుమతి ఉందంటే..?

  • ఈ రాత్రి 9 గంటల నుంచి లాక్ డౌన్ ప్రారంభం
  • రెండు వారాల పాటు కొనసాగనున్న లాక్ డౌన్
  • ఉదయం 6-10 గంటల మధ్యలోనే నిత్యావసరాలకు అనుమతి
Karnataka to face lockdown from tonight

కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపుతున్న తరుణంలో పలు రాష్ట్రాలు తల్లడిల్లిపోతున్నాయి. ఎన్ని చర్యలు తీసుకున్నా వైరస్ వ్యాప్తి కట్టడి కాకపోవడమే కాకుండా... అంతకంతకూ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో... పలు రాష్ట్రాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలో లాక్ డౌన్ విధించింది. ఈ రాత్రి 9 గంటలకు ప్రారంభంకానున్న లాక్ డౌన్ రెండు వారాల పాటు కొనసాగనుంది. లాక్ డౌన్ నేపథ్యంలో అన్ని రకాలైన ప్రజా రవాణాను ఆపేస్తున్నట్టు యడియూరప్ప ప్రభుత్వం ప్రకటించింది. నిత్యావసరాలను ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నట్టు తెలిపింది.

ఇప్పటికే షెడ్యూల్ ఖరారైన విమానాలు, రైళ్లను మాత్రం అనుమతిస్తామని కర్ణాటక ప్రభుత్వం వెల్లడించింది. లాక్ డౌన్ కాలంలో మెట్రో రైలు సేవలు కూడా ఉండవని తెలిపింది. ట్యాక్సీలు, ఆటోలకు అనుమతి లేదని... అత్యవసర సమస్యలు ఉన్నవారికి మాత్రమే ట్యాక్సీలను బుక్ చేసుకునే వెసులుబాటు ఉంటుందని స్పష్టం చేసింది. రెస్టారెంట్లు, హోటళ్లను కస్టమర్ల కోసం తెరవడానికి వీల్లేదని... అయితే, ఆహారాన్ని హోమ్ డెలివరీ చేయవచ్చని తెలిపింది.

నిన్న ఒక్కరోజే కర్ణాటకలో 34,804 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 143 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 13.39 లక్షలకు చేరుకుంది. మొత్తం 14,426 మంది మృతి చెందారు.

More Telugu News