యంత్రాంగం విఫలమైంది... కాంగ్రెస్ శ్రేణులు రాజకీయాలు వదిలేసి ప్రజాసేవకు ఉపక్రమించాలి: రాహుల్ గాంధీ పిలుపు

25-04-2021 Sun 14:53
  • దేశంలో కరోనా స్వైరవిహారం
  • ఆందోళన వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ
  • ప్రజాసేవ ఎంతో ముఖ్యమని వెల్లడి
  • ప్రజలకు ఉపశమనం కలిగించాలని విజ్ఞప్తి
  • ఇది కాంగ్రెస్ విద్యుక్త ధర్మం అని వ్యాఖ్యలు
Rahul Gandhi says system failed in country

దేశంలో కరోనా వైరస్ అడ్డుఅదుపు లేకుండా వ్యాప్తి చెందుతుండడం పట్ల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం కరోనాపై చేతులెత్తేసిందని, ఈ సమయంలో ప్రజలను ఆదుకోవడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఈ సంక్షోభ సమయంలో దేశానికి భాధ్యతాయుతమైన పౌరుల అవసరం ఎంతో ఉందని అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ సహచరులు అన్ని రాజకీయపరమైన కార్యకలాపాలను వదిలేసి ప్రజాసేవకు ఉపక్రమించాలని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. దేశ ప్రజలకు సంపూర్ణ సహకారం అందిస్తూ వారి బాధను తగ్గించే ప్రయత్నం చేయాలని సూచించారు. ఇది కాంగ్రెస్ కుటుంబ విద్యుక్త ధర్మం అని స్పష్టం చేశారు.