మహేశ్ 'మైండ్ బ్లాక్' సాంగుకి 100 మిలియన్ వ్యూస్!

24-04-2021 Sat 17:00
  • గతేడాది సంక్రాంతికి వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు'
  • మహేశ్ సరసన హీరోయిన్ గా నటించిన రష్మిక 
  • సూపర్ హిట్టయిన 'మైండ్ బ్లాక్' మాస్ సాంగ్
  • గతేడాది ఫిబ్రవరి 29న యూ ట్యూబ్ లో విడుదల  
Mahesh Babu song reaches Hundred Million views milestone

ఒక సినిమాలోని పాట ఎంత హిట్టయిందనే దానికి ఇప్పుడు కొలమానం యూ ట్యూబ్ లో ఆ పాటకి వచ్చే హిట్సే. ముఖ్యంగా మన తెలుగు సినిమాలలోని పాటలు ఇటీవలి కాలంలో యూ ట్యూబ్ లో మిలియన్ల కొద్దీ హిట్స్ తో చెలరేగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా మాస్ హీరోల సినిమాలలోని పాటలు అయితే చెప్పేక్కర్లేదు.. ఇలా యూ  ట్యూబ్ లో రిలీజ్ చేయడమే తరువాయి.. ఇక దూసుకుపోతుంటాయి. తాజాగా మహేశ్ బాబు పాట కూడా ఒకటి సరికొత్త మైలురాయిని చేరుకుంది.

  మహేశ్ బాబు, రష్మిక  జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం గతేడాది సంక్రాంతికి విడుదలై బాక్సాఫీసు వద్ద ఘనవిజయాన్ని సాధించింది. ఇందులో పాటలు కూడా బాగుండడంతో మ్యూజికల్ హిట్ అని కూడా అనిపించుకుంది.

ముఖ్యంగా మహేశ్, రష్మిక జంటపై చిత్రీకరించిన 'మైండ్ బ్లాక్..' సాంగ్ అయితే సూపర్ హిట్టయింది. పాట ట్యూన్.. కొరియోగ్రఫీ.. మహేశ్, రష్మికల మాస్ గెటప్పులతో కూడిన డ్యాన్స్.. ఫొటోగ్రఫీ .. వెరసి.. సినిమాకే ఇది హైలైట్ సాంగ్ అయింది. గతేడాది ఫిబ్రవరి 29న యూ ట్యూబ్ లో రిలీజైన ఈ పాట తాజాగా 100 మిలియన్ మైలురాయిని దాటేసింది. శ్రీమణి రాసిన ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చగా రెనైనా రెడ్డి దీనిని పాడడం జరిగింది.