సీజేఐతో సాన్నిహిత్యం నేపథ్యంలో అమికస్ క్యూరీగా తప్పుకున్న హరీశ్ సాల్వే

23-04-2021 Fri 14:37
  • కరోనా పరిస్థితులను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు
  • అమికస్ క్యూరీగా హరీశ్ సాల్వే నియామకం
  • సాల్వే నియామకంపై విమర్శలు
  • విచారణ పారదర్శకంగా ఉండాలన్న సాల్వే
  • అందుకే వైదొలగుతున్నట్టు వివరణ
Harish Salve urges Supreme Court that he does not continue as amicus curiae
దేశంలో కరోనా వ్యాప్తి విశృంఖలంగా సాగుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై నిన్న విచారణ ప్రారంభం కాగా, సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు పంపింది. దేశంలో కరోనా పరిస్థితులపై కేంద్రం తన అభిప్రాయం తెలియజేయాలంటూ తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. అటు, ఈ విచారణలో అమికస్ క్యూరీ (కోర్టు సహాయకుడు)గా సీనియర్ అడ్వొకేట్ హరీశ్ సాల్వేను నియమించింది.

అయితే హరీశ్ సాల్వే నియామకం దుమారం రేపింది. ఈ క్రమంలో హరీశ్ సాల్వే అమికస్ క్యూరీగా స్వచ్ఛందంగా తప్పుకుంటున్నట్టు నేడు ప్రకటించారు. తనకు సీజేఐ ఎస్ఏ బోబ్డేతో చిరకాలంగా సాన్నిహిత్యం ఉందని, పాఠశాల, కాలేజీ రోజుల నుంచి ఒకరికొకరం తెలుసని హరీశ్ సాల్వే వెల్లడించారు. అందుకే విచారణ పారదర్శకతతో ఉండాలన్న అభిప్రాయంతో తాను అమికస్ క్యూరీగా కొనసాగలేకపోతున్నానని వివరణ ఇచ్చారు.

ఈ సందర్భంగా హరీశ్ సాల్వే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రస్తుతం అయోమయ పరిస్థితుల్లో ఉందని, కోర్టు ముంగిట ప్రస్తుతం అత్యంత సున్నితమైన అంశం నిలిచి ఉందని పేర్కొన్నారు. సాల్వే నిర్ణయాన్ని కోర్టు సమ్మతించింది. అయితే, సాల్వే తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని సొలిసిటర్ జనరల్ కోరారు.