ఎన్నారై ఆసుపత్రి చైర్మన్ ను బెదిరించారంటూ టీడీపీ నేత ఆలపాటి రాజాపై కేసు నమోదు

23-04-2021 Fri 14:14
  • వివాదంలో చిక్కుకున్న ఆలపాటి రాజేంద్రప్రసాద్
  • గతంలో ఎన్నారై పాలకవర్గంలో సభ్యుడిగా ఉన్న ఆలపాటి సోదరుడు
  • ఎన్నారై పాలకవర్గంలో విభేదాలు
  • ఆలపాటి సోదరుడ్ని పదవి నుంచి తప్పించిన వైనం
  • చంపేస్తానని ఆలపాటి బెదిరించారన్న చైర్మన్
Police case filed on TDP leader Alapati Raja

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నారై ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్ ను బెదిరించారంటూ ఆలపాటి రాజేంద్రప్రసాద్ పై కేసు నమోదు అయింది. మంగళగిరి రూరల్ పోలీసులు ఆయనపై 506, 448, 170-2021 సెక్షన్లు నమోదు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్న ఎన్నారై మెడికల్ కాలేజి, జనరల్ ఆసుపత్రికి సంబంధించిన వివాదమే ఈ కేసుకు కారణం.

ఆలపాటి రాజేంద్రప్రసాద్ సోదరుడు రవి గతంలో ఎన్నారై పాలకవర్గంలో సభ్యుడిగా ఉన్నారు. అయితే పాలకవర్గంలో విభేదాలు తలెత్తడంతో రవిని డైరెక్టర్ పదవి నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో, రవిని తిరిగి పదవిలోకి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆలపాటి రాజేంద్రప్రసాద్ తనను బెదిరించారని నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్ మంగళగిరి (రూరల్) పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను చంపుతానని హెచ్చరించారని, ఆసుపత్రిలో బీభత్సం సృష్టించారని ఆరోపించారు. దాంతో పోలీసులు  కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.