దేశంలోనే తొలిసారి: యుద్ధ విమానాల ద్వారా ఆక్సిజన్ రవాణా​.. తెలంగాణ ప్రభుత్వం చర్యలు

23-04-2021 Fri 13:11
  • బేగంపేట విమానాశ్రయం నుంచి ఒడిశాకు విమానాలు
  • 8 ట్యాంకర్లను పంపించిన రాష్ట్ర ప్రభుత్వం
  • దగ్గరుండి చూసుకున్న మంత్రి ఈటల, సీఎస్ సోమేశ్
  • ఒడిశా నుంచి 14.5 టన్నుల ఆక్సిజన్ సరఫరాకు ఏర్పాట్లు
Telangana Govt Uses Fighter Aircrafts For Oxygen Airlifting

ఆక్సిజన్ కొరత తలెత్తకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలనూ తీసుకుంటోంది. వివిధ రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ ను తెప్పించుకుంటోంది. అందుకు దేశంలోనే తొట్టతొలిసారిగా యుద్ధ విమానాలనూ వాడుకుంటోంది. ఈ క్రమంలోనే శుక్రవారం బేగంపేట విమానాశ్రయం నుంచి 8 ఖాళీ ఆక్సిజన్ ట్యాంకర్లను యుద్ధ విమానాల్లో ఒడిశాకు పంపించింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ లు దగ్గరుండి ఈ వ్యవహారాలు చూసుకున్నారు.


బేగంపేట విమానాశ్రయంలో ఆక్సిజన్ ట్యాంకర్లను యుద్ధ విమానాల్లో తరలించే ఏర్పాట్లను పరిశీలించారు. ఆక్సిజన్ ను తరలించేందుకు యుద్ధ విమానాలను వాడుకున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. దీంతో భువనేశ్వర్ నుంచి 14.5 టన్నుల ఆక్సిజన్ యుద్ధవిమానాల్లో తెలంగాణకు రానుంది.


కాగా, మంత్రి ఈటల, సీఎస్ సోమేశ్ లను మంత్రి కేటీఆర్ అభినందించారు. ఆక్సిజన్ రవాణాలో మూడు రోజుల కాలాన్ని ఆదా చేయడంతో పాటు ఎన్నో ప్రాణాలను నిలబెట్టడం కోసం యుద్ధ విమానాల్లో ఆక్సిజన్ ను తరలించడం దేశంలో ఇదే మొదటిసారి అని ఆయన ట్వీట్ చేశారు. అత్యంత వేగంగా ఒడిశా నుంచి ఆక్సిజన్ ను తీసుకొచ్చేందుకు మంత్రి, సీఎస్ కృషి చేస్తున్నారని ప్రశంసించారు.