కరోనాతో పుట్టినరోజునే కన్నుమూసిన తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగిని!

23-04-2021 Fri 11:32
  • కామారెడ్డి జిల్లాలో ఘటన
  • తాడ్వాయిలో పనిచేస్తున్న విజయ
  • అనతికాలంలోనే రెండు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక  
  • బోరున విలపించిన ఇతర ఉద్యోగులు
Lady Officer Died with Corona on her Birthday in Kamareddy Dist

కామారెడ్డి జిల్లా పద్మాజివాడి గ్రామానికి చెందిన విజయ (26) అనే యువతి, కరోనా సోకి, వ్యాధి ముదిరి కన్నుమూయడం విషాదాన్ని మిగిల్చింది. ఆమె ప్రస్తుతం తాడ్వాయి తహసీల్దారు కార్యాలయంలో ఉద్యోగినిగా పనిచేస్తోంది. నిన్న ఆమె జన్మదినం కావడం గమనార్హం. అదే రోజున ఆమె మరణించడంతో కార్యాలయంలోని ఉద్యోగులు బోరున విలపించారు.

గతంలో గ్రామ పంచాయతీ సెక్రటరీగా సెలక్ట్ అయి, ఆపై కొద్దికాలంలోనే తన పనితీరు, విద్యార్హతలతో రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా ఆమె పోస్టింగ్ ను పొందారు. అనతికాలంలోనే రెండు సార్లు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంతో ఆమెను ఎంతో మంది ఉన్నతాధికారులు ప్రశంసించారు కూడా. ఆమె మరణించడం తమ కార్యాలయానికి ఎంతో లోటని, ఆమె కుటుంబానికి సంతాపం తెలుపుతున్నామని అధికారులు వ్యాఖ్యానించారు.