ధనుశ్ 'జగమే తంత్రం' రిలీజ్ ఓటీటీలోనే!

23-04-2021 Fri 11:25
  • కార్తీక్ సుబ్బరాజ్ తాజా చిత్రంగా 'జగమే తంత్రం'
  • గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్న ధనుశ్
  • కథానాయికగా ఐశ్వర్య లక్ష్మి
Jagame Thandiram is going to release Net Flix

మొదటి నుంచి కూడా తన సినిమాల మధ్య గ్యాప్ ఇచ్చే అలవాటు ధనుశ్ కి లేదు. వైవిధ్యభరితమైన కథలకు ఆయన ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుంటాడు. అవసరమైతే తానే నిర్మాతగా మారుతుంటాడు. కుదిరితే పాటలు రాసేస్తాడు .. నచ్చితే పాడేస్తాడు కూడా.

అలాంటి ధనుశ్ నుంచి తాజాగా వచ్చిన 'కర్ణన్' సినిమా, ఈ ఏడాది సూపర్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఆ తరువాత 'జగమే తంతిరమ్' సినిమా కూడా థియేటర్లకు వస్తుందని అభిమానులు అనుకున్నారు. కానీ కరోనా ప్రభావం కారణంగా ఈ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.

నెట్ ఫ్లిక్స్ వారు ఈ సినిమాను జూన్ లో రిలీజ్ చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. జూన్ 11వ తేదీన గానీ 13వ తేదీన గాని ఈ సినిమాను స్ట్రీమింగ్ కి పెట్టాలనే విషయంపై చర్చలు నడుస్తున్నాయట. రిలీజ్ డేట్ తో ట్రైలర్ ను మే 14వ తేదీన వదలాలనే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, తెలుగులో 'జగమే తంత్రం' టైటిల్ తో పలకరించనుంది. కెరియర్ పరంగా ధనుశ్ కి ఇది 40వ సినిమా. ఆయన సరసన ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటించింది. గ్యాంగ్ స్టర్ గా ధనుశ్ నటించిన ఈ సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.