ఇజ్రాయెల్‌లో మునుపటి స్వేచ్ఛ.. అక్కడిక మాస్కులు లేకుండా తిరిగేయొచ్చు!

23-04-2021 Fri 08:14
  • తప్పనిసరిగా మాస్క్ ధరించాలన్న ఆదేశాలు రద్దు
  • దేశంలో సగం జనాభాకు పైగా టీకా
  • ఇజ్రాయెల్‌పై కురుస్తున్న ప్రశంసలు
  • ప్రపంచానికి తాము మార్గదర్శకులమయ్యామన్న బెంజమిన్ నెతన్యాహు
Israel finally goes mask free

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోమారు విజృంభిస్తున్న వేళ ఇజ్రాయెల్ కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా సగం మంది జనాభాకు వ్యాక్సినేషన్ పూర్తికావడంతో తప్పనిసరిగా మాస్క్ ధరించాలన్న ఆదేశాలను ప్రభుత్వం ఆదివారం రద్దు చేసింది. ఇకపై మార్కెట్లు, మాల్స్, ప్రార్థనా స్థలాలు, దుకాణాల్లో మాస్కులు లేకుండానే సంచరించవచ్చని పేర్కొంది. అలాగే, బడులను తిరిగి ప్రారంభించింది. ముందుచూపుతో వ్యవహరించి మహమ్మారిపై ఇజ్రాయెల్ విజయం సాధించిందంటూ ‘న్యూయార్క్ టైమ్స్’ ప్రశంసించింది.

ఇజ్రాయెల్‌లో ఇప్పటికే 60 శాతం మందికిపైగా టీకా తొలిడోసు తీసుకోగా, 56 శాతం మంది రెండు డోసునూ తీసుకున్నారు. అయితే, 16 ఏళ్లలోపు వారిని టీకాల నుంచి మినహాయించారు. మాస్కులు ధరించాలన్న ఆదేశాలను రద్దు చేసిన తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ.. వైరస్‌ను ఎదుర్కోవడంలో మిగతా దేశాలకు తాము మార్గదర్శకులమయ్యామని పేర్కొన్నారు.