West Bengal: ప్రచార కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్న మమతా బెనర్జీ!

Mamata Banerjee Cancels all her Campaigns
  • బెంగాల్‌లో విజృంభిస్తున్న కరోనా
  • చర్యలు ప్రారంభించిన ఈసీ
  • ప్రచార కార్యక్రమాలపై ఆంక్షలు
  • ఈసీ చర్యలకు అనుగుణంగా దీదీ నిర్ణయం
ఎన్నికలు జరుగుతున్న పశ్చిమ బెంగాల్‌లో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తన తదుపరి ప్రచార కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. వర్చువల్‌గా ప్రజల వద్దకు చేరుకుంటానని తెలిపారు. వర్చువల్‌ సమావేశాలకు సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడిస్తానని పేర్కొన్నారు.

పబ్లిక్ ర్యాలీలు, పాదయాత్రలు, రోడ్‌ షోలపై ఎన్నికల సంఘం  నిషేధం విధించిన విషయం తెలిసిందే.  500 కంటే తక్కువ మంది హాజరయ్యే సమావేశాలకు మాత్రమే అనుమతి నిచ్చింది. రాష్ట్రంలో ఇంకా రెండు విడతల పోలింగ్‌ మిగిలి ఉన్న తరుణంలో ఈసీ చర్యలు ప్రారంభించింది. బెంగాల్‌లో కరోనా పరిస్థితిపై చర్యలు తీసుకోవాలని కోల్‌కతా హైకోర్టు నేడు ఎన్నికల సంఘాన్ని ఆదేశించిన నేపథ్యంలోనే ఈసీ ఈ చర్యలకు ఉపక్రమించింది. మరోవైపు ప్రధాని మోదీ సైతం రేపటి సభను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.
West Bengal
Mamata Banerjee
TMC
election commission

More Telugu News