కరోనా టైమ్ లో డేర్ చేస్తున్న వరుణ్ తేజ్!

22-04-2021 Thu 18:35
  • బాక్సింగ్ నేపథ్యంలో సాగే కథ
  • కథానాయికగా సయీ మంజ్రేకర్ పరిచయం
  • కీలకమైన పాత్రలో జగపతిబాబు
  • ముఖ్య పాత్రల్లో సునీల్ శెట్టి ... ఉపేంద్ర  
Ghani movie shooting will be started soon
ఈ సారి అటో ఇటో తేల్చుకుందాం అన్నట్టుగానే కరోనా రంగంలోకి దిగిందా? అని అంతా అనుకుంటున్నారు. కరోనా వార్తలు చూడటానికి కూడా భయపడిపోతున్నారు. అలాంటి ఈ పరిస్థితుల్లో చాలా సినిమాల షూటింగులు వాయిదా పడుతున్నాయి. ఆర్టిస్టుల కాంబినేషన్లోని డేట్లు దొరకడం కష్టమని తెలిసి కూడా దర్శక నిర్మాతలు పేకప్ చెప్పేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వరుణ్ తేజ్ మాత్రం షూటింగుకు రెడీ అవుతున్నాడు. ఇక ఆలస్యం చేసేది లేదంటూ సెట్స్ పైకి వెళ్లడానికి మాంఛి ఉత్సాహంగా ఉన్నాడు.

వరుణ్ తేజ్ తాజా చిత్రంగా 'గని' రూపొందుతోంది. ఈ సినిమా ద్వారా కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సిద్ధు ముద్ద .. అల్లు బాబీ ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ విదేశాలకి వెళ్లి అక్కడ బాక్సింగ్ లో శిక్షణ పొందాడు. ఇప్పటికే ఈ సినిమాను మొదలుపెట్టడంలో ఆలస్యమైపోయింది. అందువలన బాక్సింగ్ నేపథ్యంలో వచ్చే ఇండోర్ సీన్స్ ను .. తక్కువమంది సిబ్బందితో చిత్రీకరించాలని నిర్ణయించుకున్నారట. ఆ దిశగా పనులు మొదలయ్యాయని అంటున్నారు. సయీ మంజ్రేకర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, జగపతిబాబు .. సునీల్ శెట్టి .. ఉపేంద్ర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.