Balka Suman: వైఎస్ షర్మిల మాటలు వింటుంటే నవ్వొస్తోంది: బాల్క సుమన్

YS Sharmilas comments are ridiculous says Balka Suman
  • ఉద్యోగాల విషయంలో షర్మిలకు అవగాహన లేదు
  • రాజన్న రాజ్యం తీసుకొస్తానన్న ఆమె వ్యాఖ్యలు హాస్యాస్పదం
  • కేంద్రం వల్లే ఉద్యోగాల నియామకాలు ఆలస్యమయ్యాయి
రాష్ట్రంలోని ఉద్యోగాల విషయంలో వైఎస్ షర్మిలకు ఏమాత్రం అవగాహన లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానంటూ ఆమె చెపుతున్న మాటలు వింటుంటే తనకు నవ్వొస్తోందని అన్నారు. స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు దక్కేలా ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని కొనియాడారు.

ఉమ్మడి ఏపీలో స్థానికులకు ఉద్యోగాలు రాకుండా ఓపెన్ కోటా ఉండేదని చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో జరిగిన అన్యాయంపై పోరాటం చేసి, తెలంగాణను సాధించుకున్నామని... ఆ అన్యాయాన్ని కేసీఆర్ సరిదిద్దుతున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వల్లే ఉద్యోగాల నియామకాలు ఆలస్యమయ్యాయని... రానున్న రోజుల్లో ఉద్యోగాల భర్తీ ఊపందుకుంటుందని చెప్పారు.

గత ఆరున్నరేళ్లలో తెలంగాణ ప్రభుత్వం 1.32 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిందని బాల్క సుమన్ తెలిపారు. టీఎస్ ఐపాస్ ద్వారా ప్రైవేట్ రంగంలో లక్షలాది ఉద్యోగాలు లభించాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు బీజేపీ నేతలకు లేదని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేశారో బీజేపీ నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు.
Balka Suman
TRS
YS Sharmila
BJP

More Telugu News