దిల్ రాజు సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం?

21-04-2021 Wed 17:04
  • శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా 
  • పాన్ ఇండియా మూవీగా నిర్మాణం
  • పవర్ ఫుల్ గా తండ్రీకొడుకుల పాత్రలు
  • తండ్రి పాత్రలో చరణ్ లుక్ టెస్ట్ చేశాక నిర్ణయం  
Ram Charan ready to play duel roles

వెండితెరపై హీరోలు డబుల్ రోల్స్ వేయడం అనేది ఎప్పటి నుంచో వుంది. అసలు అలా ద్విపాత్రాభినయం చేయడానికి ప్రతి హీరో కూడా ఉవ్విళ్లూరుతూ ఉంటాడు. మంచి కథ దొరికితే మాత్రం ఏ హీరో కూడా అలాంటి అవకాశాన్ని వదులుకోడు. ఇలాంటి ద్విపాత్రాభినయం విషయంలో ఎక్కువగా కవల సోదరులు, తండ్రీకొడుకులు వంటి పాత్రలను ఆయా రచయితలు సృష్టిస్తూ వుంటారు. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ సినిమాలో డ్యూయల్ రోల్ చేసే అవకాశం ఉన్నట్టు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.

ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా రూపొందనున్న విషయం విదితమే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్టుతో నిర్మించే ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనుంది. ఈ సినిమాలో రష్మిక కథానాయికగా నటిస్తుందంటూ వార్తలు కూడా వచ్చాయి.

ఇక ఇందులో తండ్రీకొడుకుల పాత్రలు వున్నాయట. ఈ రెండు పాత్రలూ పవర్ ఫుల్ పాత్రలు కావడంతో తాను ద్విపాత్రాభినయం చేస్తానంటూ చరణ్ దర్శకుడి ముందు ఓ ప్రపోజల్ పెట్టినట్టు చెబుతున్నారు. అయితే, ముందుగా తండ్రి పాత్రలో చరణ్ కి లుక్ టెస్ట్ చేసిన తర్వాత ఏ విషయం ఫైనల్ అవుతుందని అంటున్నారు. మరి, చరణ్ ని మెగా అభిమానులు ద్విపాత్రాభినయంలో చూస్తారా? లేదా? అన్నది త్వరలో వెల్లడవుతుంది!