స్లో ఓవర్ రేట్ ఎఫెక్ట్.. ముంబై కెప్టెన్ రోహిత్‌కు జరిమానా

21-04-2021 Wed 11:39
  • గత రాత్రి ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఓడిన ముంబై
  • స్లో ఓవర్ రేట్ కారణంగా రూ. 12 లక్షల జరిమానా
  • నాలుగు మ్యాచుల్లో రెండింటిలో ఓడిన రోహిత్ సేన
Rohit Sharma Fined for Slow Over Rate
గత రాత్రి ఢిల్లీ కేపిటల్స్ చేతిలో ఓటమి పాలైన ముంబై జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం రూ. 12 లక్షల జరిమానా విధించారు. మరోసారి కూడా ఇలాంటి ఉల్లంఘనే నమోదైతే అప్పుడీ జరిమానా రూ. 24 లక్షలకు పెరుగుతుంది. అంతేకాదు, జట్టు కెప్టెన్ సహా ఆటగాళ్లందరికీ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధిస్తారు.

మూడోసారి కూడా స్లో ఓవర్ రేట్ నమోదైతే కెప్టెన్‌కు ఓ మ్యాచ్ నిషేధం విధిస్తారు. అంతేకాక రూ. 30 లక్షల జరిమానా విధిస్తారు. ఈ సీజన్‌లో సీఎస్‌కే కెప్టెన్ ధోనీ ఇప్పటికే ఈ జరిమానా ఎదుర్కొన్నాడు. కాగా, గతరాత్రి ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఘోరంగా విపలమై ఓటమి చవిచూసింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన ముంబై రెండింటిలో ఓటమి పాలైంది.