‘ఇష్క్​’ సినిమా విడుదల వాయిదా

21-04-2021 Wed 11:25
  • ప్రకటించిన హీరో తేజ సజ్జ
  • కరోనా తీవ్రత నేపథ్యంలో ప్రకటన
  • త్వరలోనే కొత్త తేదీ చెబుతామని వెల్లడి
  • సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
ISHQ Movie Postponed Due to Covid Worse Situation
కరోనా ప్రభావం ‘ఇష్క్– నాట్ ఎ లవ్ స్టోరీ’ మూవీపై పడింది. సినిమా విడుదల వాయిదా పడింది. నిన్నటి నుంచి తెలంగాణ ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధించింది. సినీ ఇండస్ట్రీ ప్రతినిధులూ థియేటర్లను మూసేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు తేజ ప్రకటించారు. వాస్తవానికి శుక్రవారం (23వ తేదీ) నుంచి ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.

అయితే, రెండు వారాలుగా కరోనా పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని, ఇలాంటి సమయంలో సినిమాను విడుదల చేస్తే బాగుండదని, నైతికంగా సరైన నిర్ణయం కాదని తేజ చెప్పుకొచ్చారు. త్వరలోనే కొత్త విడుదల తేదీతో అందరి ముందుకు వస్తామని చెప్పారు. కరోనా తీవ్రతను తాము అర్థం చేసుకోగలమని, అందుకే ప్రజల భద్రత, సాయానికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు.


పరిస్థితులు చెయ్యి దాటిపోతున్నాయని, ఈ నేపథ్యంలోనే ప్రజల భద్రతకు గౌరవం ఇచ్చి సినిమాను వాయిదా వేశామని చెప్పారు. కొత్త తేదీ ప్రకటించేదాకా ప్రతి ఒక్కరూ మాస్క్ లు ధరించాలని, ఇంట్లోనే క్షేమంగా ఉండాలని తేజ విజ్ఞప్తి చేశారు. అలాగే కరోనా బారిన పడిన సీఎం కేసీఆర్, ఇతర బాధితులంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.