రాజకీయ కుట్రలో భాగంగానే ఆరోపణలు.. ఎవరు చేయిస్తున్నారో బయటపడుతుంది: ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి

21-04-2021 Wed 07:02
  • తాను ఎస్టీ కాదంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందన  
  • ఆరోపణలు చేస్తున్న వారు రుజువు చేయాలని సవాలు
  • టీడీ పారాపురం వెళ్లి అడిగితే తెలుస్తుందన్న శ్రీవాణి
Allegations are part of a political conspiracy says Pushpa Sreevani
తాను ఎస్టీని కాదంటూ జరుగుతున్న ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి స్పందించారు. రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టేందుకు కొందరు కావాలనే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇవన్నీ ఎవరు చేయిస్తున్నారో, ఎందుకు చేయిస్తున్నారో  భవిష్యత్తులో బయటపడతాయన్నారు.

తాను ఎస్టీని కాకపోతే 2014లో తన కుటుంబం మొత్తానికి డిజిటల్ ధ్రువీకరణ పత్రాలను అధికారులు ఎలా మంజూరు చేస్తారని ప్రశ్నించారు. శ్రీకాకుళం మండలం పాలకొండ నియోజకవర్గంలోని టీడీ పారాపురం వెళ్లి తమ గురించి అడిగితే వాస్తవాలు తెలుస్తాయన్నారు.

తన సోదరి వెంకటరామ తులసి 2008లో డీఎస్సీలో కేఆర్‌పురం ఐటీడీఏలో స్కూల్ అసిస్టెంట్‌గా ఎంపికయ్యారని, అయితే, జీవో 3 ప్రకారం ఆ ఉద్యోగానికి స్థానికులే అర్హులు కావడంతో అధికారులు ఆమెను అనర్హురాలిగా ప్రకటించారని గుర్తు చేశారు. కానీ కొందరు మాత్రం ఎస్టీ కాదు కాబట్టే ఆమెకు ఉద్యోగం రాలేదని తాజాగా ఆరోపిస్తున్నారని అన్నారు. ఆరోపణలు చేస్తున్న వారు ఈ విషయాన్ని రుజువు చేయాలని డిప్యూటీ సీఎం సవాలు విసిరారు.