NASA: మార్స్​ హెలికాప్టర్​ వెనక భారతీయ నైపుణ్యం!

  • ఇంజెన్యుటీ ఎగరడంలో బాబ్ బలరాం కీలక పాత్ర
  • ప్రాజెక్టుకు చీఫ్ ఇంజనీర్ గా పనిచేసిన వైనం
  • ఐఐటీ మద్రాస్ లో మెకానికల్ ఇంజనీరింగ్
  • అమెరికా అత్యంత పురాతన వర్సిటీలో ఎంఎస్, పీహెచ్ డీ
  • నాసాలో 20 ఏళ్లుగా పనిచేస్తున్న బలరాం
IIT Madras alumnus Bob Balaram the man behind Nasas Ingenuity Mars helicopters historic flight

నాసా చేపట్టిన అరుణ గ్రహ ప్రయోగంలో భారతీయులు దూసుకెళ్తున్నారు. మొన్నటికిమొన్న మార్స్ రోవర్ పర్సెవరెన్స్ ల్యాండింగ్ లో స్వాతి మోహన్ అనే భారతీయ శాస్త్రవేత్త కీలక పాత్ర పోషిస్తే.. ఇప్పుడు అంగారకుడిపై నాసా హెలికాప్టర్ ఇంజెన్యుటీ ఎగరడంలో మరో భారతీయ శాస్త్రవేత్త కీలక పాత్ర పోషించారు. ఆయన పేరు బాబ్ బలరాం. సోమవారం నాసా ఇంజెన్యుటీ హెలికాప్టర్ ను మార్స్ పై విజయవంతంగా ఎగరేలా చేసిన సంగతి తెలిసిందే. తద్వారా విశ్వంలోని ఇతర గ్రహాలపై తొలిసారి ఎయిర్ క్రాఫ్ట్ ను ఎగరేసిన ఘనతను అందుకుంది.


అయితే, అందులో కీలక పాత్ర పోషించింది మాత్రం బలరామే. ఇంజెన్యుటీకి చీఫ్ ఇంజనీర్ గా పనిచేసిన ఆయన.. 1975–80 మధ్య ఐఐటీ మద్రాస్ లో చదివారు. మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన ఆయన.. ఆ తర్వాత అమెరికాలోనే అత్యంత పురాతన యూనివర్సిటీ అయిన రెన్సెలార్ పాలిటెక్నిక్ ఇనిస్టిట్యూట్ లో కంప్యూటర్ అండ్ సిస్టమ్ ఇంజనీరింగ్ లో ఎంఎస్ చేశారు. అదే యూనివర్సిటీ నుంచి పీహెచ్ డీ పట్టా పొందారు.


చంద్రుడిపై కాలు మోపిన అపోలో ప్రయోగంతో అంతరిక్ష రంగంపై తనకు మక్కువ పెరిగిందని ఆయన చెబుతారు. ప్రస్తుతం నాసా జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీలో మార్స్ హెలికాప్టర్ స్కౌట్ ప్రాజెక్ట్ కు చీఫ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. అంతకుముందు మార్స్ పై కచ్చితమైన ల్యాండింగ్ పద్ధతులు, ఓ గ్రహం మీద దిగేందుకు అధునాతన సిమ్యులేషన్ పద్ధతుల వంటి వాటిలో భాగమయ్యారు. అత్యంత కచ్చితత్వంతో పనిచేసే ఈడీఎల్ సిమ్యులేటర్ అభివృద్ధిలోనూ ఆయనది కీలక పాత్ర. మార్స్ పై దిగిన క్యూరియాసిటీ, పర్సెవరెన్స్ రోవర్ల సిమ్యులేషన్ కు దానినే వాడారు.

More Telugu News