Andhra Pradesh: ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు యథాతథం... 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు రేపటి నుంచి సెలవులు

  • రాష్ట్రంపై కరోనా పంజా
  • పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష
  • షెడ్యూల్ ప్రకారమే పబ్లిక్ పరీక్షలు
  • కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షలు జరుపుతామన్న ఆదిమూలపు
  • 1 నుంచి 9వ తరగతి విద్యాసంవత్సరం పూర్తయిందని వెల్లడి
Tenth and Inter exams in AP will be conducted as per schedule

ఏపీలో కరోనా వ్యాప్తి భీకరస్థాయికి చేరిన నేపథ్యంలో సీఎం జగన్ మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించడం తెలిసిందే. ఈ కీలక భేటీ ముగిసిన అనంతరం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రభుత్వ నిర్ణయాలను వెల్లడించారు. ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే పదో తరగతి, ఇంటర్ పరీక్షలు ప్రస్తుతానికి యథాతథంగా జరుగుతాయని వెల్లడించారు. ఇంటర్ ప్రాక్టికల్స్ ఈ నెల 24కి పూర్తవుతున్నాయని, ఆపై థియరీ పరీక్షలు మే 5 నుంచి 23 వరకు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని వివరించారు. విద్యార్థులు నష్టపోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

అయితే, 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు రేపటి నుంచి సెలవులు ఇస్తున్నట్టు తెలిపారు. 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం పూర్తయిందని స్పష్టం చేశారు. పాఠశాలల్లో ఇప్పటివరకు కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించామని మంత్రి ఆదిమూలపు సురేశ్ పేర్కొన్నారు. కరోనా నిబంధనలు పూర్తిస్థాయిలో పాటిస్తూనే టెన్త్, ఇంటర్ పరీక్షలు జరుపుతామని అన్నారు.

More Telugu News