ఏపీలో వేగంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి... కొత్తగా 7 వేలకు పైగా పాజిటివ్ కేసులు

17-04-2021 Sat 17:50
  • గత 24 గంటల్లో 35,907 కరోనా పరీక్షలు
  • 7,224 మందికి పాజిటివ్
  • చిత్తూరు జిల్లాలో 1,051 కొత్త కేసులు
  • ఇతర జిల్లాల్లోనూ కొవిడ్ బీభత్సం
  • రాష్ట్రంలో 15 మంది మృతి
Corona Virus rapidly spreads in AP

ఏపీలో కరోనా వైరస్ భూతం విజృంభణ నానాటికీ అధికమవుతోంది. గడచిన 24 గంటల్లో 35,907 కరోనా పరీక్షలు నిర్వహించగా 7,224 మందికి పాజిటివ్ అని తేలింది. రాష్ట్రంలోకెల్లా కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉన్న చిత్తూరు జిల్లాలో వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఇటీవల కాలంలో ఓ జిల్లాలో నాలుగంకెల్లో కొత్త కేసులు రావడం ఇదే ప్రథమం. చిత్తూరు జిల్లాలో తాజాగా 1,051 కేసులు నమోదయ్యాయి.

ఇతర జిల్లాలలోనూ కరోనా బీభత్సం కొనసాగుతోంది. తూర్పు గోదావరిలో 906, గుంటూరు జిల్లాలో 903, శ్రీకాకుళం జిల్లాలో 662, నెల్లూరు జిల్లాలో 624 పాజిటివ్ కేసులు గుర్తించారు. అదే సమయంలో 2,332 మంది కరోనా నుంచి కోలుకోగా, 15 మంది మృత్యువాత పడ్డారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 9,55,455 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 9,07,598 మంది కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 40,469 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 7,388కి పెరిగింది.