ఒలింపిక్స్​ లో పాల్గొనేందుకు పురుషులు, మహిళల టీంకు బీసీసీఐ ఓకే!

17-04-2021 Sat 13:32
  • 2028 ఒలింపిక్స్ పై సూత్రప్రాయ నిర్ణయం
  • రోస్టర్ లో చేరిస్తే ఆడిస్తామని కామెంట్
  • కామన్ వెల్త్ గేమ్స్ లో తలపడేందుకు మహిళల టీంకు గ్రీన్ సిగ్నల్
BCCI Agrees For Men and Women Teams To Participates in Olympics

ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేరిస్తే పురుషులు, మహిళల టీంలను అందులో ఆడించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చింది. బోర్డు అపెక్స్ కౌన్సిల్ వర్చువల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. 2028లో జరిగే లాస్ ఏంజిలిస్ ఒలింపిక్స్ రోస్టర్ లో క్రికెట్ ను చేరిస్తే రెండు టీంలను పంపాలని యోచిస్తోంది. వచ్చే ఏడాది బ్రిటన్ లోని బర్మింగ్ హాంలో జరగబోయే కామన్ వెల్త్ గేమ్స్ కు మహిళల టీంను పంపించేందుకు అపెక్స్ కౌన్సిల్ అంగీకరించింది.

దాంతో పాటు మహిళల టీంకు సంబంధించి షెడ్యూల్ నూ ఖరారు చేసింది. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాతో సిరీస్ ఆడేందుకు నిర్ణయించింది. ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్ నకు సన్నాహకంగా న్యూజిల్యాండ్ తో మరో సిరీస్ ను ఆడేందుకు ఓకే చెప్పింది. ఇక, గత ఏడాది జరిగినట్టే మూడు జట్లతో మహిళల ఐపీఎల్ నిర్వహించేందుకు డిసైడ్ అయింది.

ఆ తర్వాత వెంటనే ఇంగ్లండ్ లో సిరీస్ ఆడనుంది. తిరిగొచ్చాక స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్ ఆడుతుంది. ఆ సిరీస్ పూర్తవ్వగానే ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాతో, ఆ తర్వాత న్యూజిలాండ్ తో ద్వైపాక్షిక లేదా త్రైపాక్షిక సిరీస్ ను మహిళల టీం ఆడనుంది. దాంతో పాటు పూర్తి స్థాయి డొమెస్టిక్ క్రికెట్ మ్యాచ్ లను ఆడేందుకు బీసీసీఐ క్యాలెండర్ ను సిద్ధం చేసింది.