గుడ్‌న్యూస్.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వ ఉద్యోగాల ఖాళీల భ‌ర్తీకి కార్యాచ‌ర‌ణ‌!

16-04-2021 Fri 13:08
  • డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ
  • ఉద్యోగాల భర్తీకి శాఖలు, విభాగాల వారీగా క్యాలెండర్
  • మే 31న ఉద్యోగ క్యాలెండర్ విడుద‌ల చేసే అవ‌కాశం
  • ప్ర‌భుత్వ‌ శాఖలు, విభాగాలు, సంస్థలు, వర్సిటీల్లో ఉద్యోగాల భ‌ర్తీ
government jobs alert in ap

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వ ఉద్యోగాల ఖాళీల భ‌ర్తీకి కార్యాచ‌ర‌ణ సిద్ధ‌మ‌వుతోంది. ఖాళీగా ఉన్న పోస్టులను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేయాల‌ని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. ఉద్యోగాల భర్తీకి శాఖలు, విభాగాల వారీగా క్యాలెండర్‌ రూపొందిస్తోంది. మే 31న ఈ ఉద్యోగ క్యాలెండర్ ను విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది.  

ఇందులో భాగంగా, అన్ని ప్ర‌భుత్వ‌ శాఖలు, విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, యూనివర్సిటీల్లో ఉద్యోగాల ఖాళీల వివరాలను తెల‌పాల‌ని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్ సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. ఇదే విషయంపై తాజాగా ఆయ‌న‌ అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో సమావేశం నిర్వహించి చ‌ర్చించారు. భ‌ర్తీ చేయాల్సిన‌ పోస్టుల వివరాలను డైరెక్టరీ ఆఫ్‌ పోస్ట్స్‌ అండ్‌ పర్సనల్‌ విభాగంలో నమోదు చేయాలని చెప్పారు.

 గ్రూప్‌ 1, 2, 3, 4 కేటగిరీల్లో పోస్టుల ఖాళీలపై పూర్తి గ‌ణాంకాలు ప్ర‌భుత్వానికి అందాల్సి ఉంది. అలాగే, బ్యాక్‌లాగ్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ పోస్టుల ఖాళీలను కూడా పేర్కొనాల్సిందిగా అధికారుల‌ను సీఎస్ ఆదేశించారు. ఖాళీగా ఉన్న డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ పోస్టుల్లో ప్రాధాన్యత క్రమంలో ఏయే పోస్టులు భర్తీ చేయాలో సంబంధిత శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు సూచించాలని చెప్పారు.