భవిష్యత్తు ముప్పును ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేయండి: వాయుసేనను కోరిన రాజ్‌నాథ్‌

15-04-2021 Thu 23:07
  • ఐఏఎఫ్‌ సమావేశంలో పాల్గొన్న రక్షణమంత్రి
  • దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచన
  • చైనాను దీటుగా ఎదుర్కొన్నారని ప్రశంస
  • భవిష్యత్తుకు సాంకేతికత సమకూర్చుకోవాలని హితవు
Rajnath Praises IAF for befitting reply to china

భవిష్యత్తులో దేశ భద్రతకు తలెత్తే ముప్పును ఎదుర్కొనేందుకు  దీర్ఘకాలిక ప్రణాళికలు, వ్యూహాలు రచించాలని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వాయుసేనకు చెందిన ఉన్నతాధికారులను కోరారు. అలాగే తూర్పు లడఖ్‌లో చైనాతో జరిగిన ఘర్షణలో సమయానుకూలంగా దీటైన జవాబిచ్చినందుకు వాయుసేనను ప్రశంసించారు. ఏటా రెండుసార్లు జరిగే ఐఏఎఫ్‌ కమాండర్స్‌ కాన్ఫరెన్స్‌లో గురువారం ఆయన ప్రసంగించారు.

భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తమను తాము తీర్చిదిద్దుకుంటున్న వాయుసేన తీరును ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ అభినందించారు. భవిష్యత్తు యుద్ధ తంత్రాలు వేగంగా మారుతున్నాయని, అందుకు వీలుగా సరైన సాంకేతికత, సమాచారం సహా ఇతర సామర్థ్యాలను సమకూర్చుకోవాలని సూచించారు. అలాగే త్రివిధ దళాల మధ్య సమన్వయంపై ఇంకా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

భారత్‌, చైనా మధ్య లడఖ్‌ సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణపై చర్చలు కొనసాగుతున్న తరుణంలో ఈ సమావేశం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న థియేటర్ల వ్యవస్థ ఏర్పాటుపై సైతం ఉన్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఐఏఎఫ్‌ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.